ఎట్టకేలకు సల్మాన్ మాతృభూమికి మోక్షం..
ABN, Publish Date - Oct 03 , 2026 | 09:32 PM
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ చిత్రానికి అడ్డంకులు తొలగాయి. ఎట్టకేలకు 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్'(Maatrubhumi: May War Rest in Peace) రిలీజ్ కి మోక్షం కలిగింది.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ చిత్రానికి అడ్డంకులు తొలగాయి. ఎట్టకేలకు 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్'(Maatrubhumi: May War Rest in Peace) రిలీజ్ కి మోక్షం కలిగింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం చాలా కాలంగా వివిధ వివాదాలు, విదేశీ దౌత్యపరమైన అంశాల కారణంతో విడుదలకు నోచుకోకుండా ఆలస్యమవుతూ వస్తోన్న విషయం తెల్సిందే. తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఈ చిత్రానికి అభ్యంతరం లేదని తెలియజేస్తూ అధికారికంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ప్రారంభంలో ఈ సినిమాకి బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను నిర్ణయించారు. 2020లో భారతదేశం-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. అయితే, ఇటీవల కాలంలో భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు, శాంతి చర్చలు పురోగమించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రంపై దృష్టి పెట్టింది. పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు సినిమా టైటిల్‌ను మాత్రమే కాకుండా, కథనం, విజువల్ ప్రెజెంటేషన్‌లో కూడా మార్పులు చేయాలని మేకర్స్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రబృందం భారత్-చైనా సరిహద్దు పరిస్థితులను, దేశాల మధ్య సంబంధాలను ప్రతికూలంగా చూపించకుండా కథనంలో భారీ మార్పులు చేసి రీ-షూట్స్ పూర్తి చేసింది.
నూతనంగా రూపొందించిన ఈ వెర్షన్‌ను తిలకించిన సమాచార శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఎన్ఓసి జారీ చేశారు. ప్రభుత్వ క్లియరెన్స్ లభించడంతో ఈ సినిమా త్వరలోనే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లనుంది. అక్కడ కూడా క్లియరెన్స్ పూర్తయితే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మార్గం సుగమం కానుంది. తీవ్ర చర్చల మధ్య నిలిచిన ఈ వార్ డ్రామా నవంబర్ 13న లేదా అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఆటంకాల తర్వాత కేంద్రం ఆమోదం ముద్ర వేయడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు, సినీ విశ్లేషకులు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. మరి ఈ సినిమా సల్మాన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.