‘మాతృభూమి’ ట్రైలర్‌ ఏదీ సల్మాన్ భాయ్‌?

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:14 PM

సల్మాన్ ఖాన్ నటించి నిర్మించిన ‘మాతృభూమి’ సినిమా ట్రైలర్‌పై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 6న మీడియాకు ప్రదర్శించి, నవంబర్ 8న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ట్రైలర్‌ ఇంకా సోషల్ మీడియాలోకి రాలేదు. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Matrubumi movie

సల్మాన్ ఖాన్ నటించి, నిర్మించిన 'మాతృభూమి' చిత్రానికి మొదటి నుంచి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్ నిర్మించిన ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్‌, ముఖేశ్‌ రిషి, అంకుర్ భాటియా, జేన్‌ షా, అఖిలాష్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారత్‌ - చైనా సైనికుల మధ్య జరిగి ఘర్షణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు మొదట 'బ్యాటిల్‌ ఆఫ్ గల్వాన్' అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దీనికి 'మాతృభూమి' అనే నామకరణం చేశారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్‌ 6న మీడియా ప్రతినిధుల కోసం ప్రదర్శించారు. ఆ సమావేశంలో సల్మాన్ ఖాన్ సైతం పాల్గొన్నాడు. ఈ ట్రైలర్‌ ను దీపావళి కానుకగా నవంబర్‌ 8న సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నట్టు మేకర్స్ చెప్పారు. అయితే పండగ వెళ్ళి రెండు రోజులు గడిచినా దీనికి సంబంధించిన వివరాలను దర్శక నిర్మాతలు తెలియచేయకుండా మౌనం వహించారు. దాంతో నెటిజన్స్ 'మాతృభూమి' ట్రైలర్‌ ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


ప్రభుత్వం చెప్పడంతో 'మాతృభూమి' సినిమా కథను మార్చామని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ట్రైలర్‌ ఆవిష్కరణ రోజున సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. తమ చిత్రం సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ తిరుగుతుందని, ఇరు దేశాల వైపు ఉన్న సైనికుల నిజజీవితాలను ఇందులో చూపించామని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎవరి పట్ల నెగెటివిటీని చూపించలేదని అన్నారు. ఇప్పుడీ సినిమాను డిసెంబర్‌ 4న విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమౌతున్న 'రామాయణ' ట్రైలర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను జూలై 18న మీడియా ప్రతినిధులకు, ప్రత్యేక ఆహ్వానితులకు ప్రదర్శించారు. అయితే ఆ వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అధికారికంగా 'రామాయణం' ట్రైలర్‌ జూలై 30న పబ్లిక్‌ డొమైన్ లో పెట్టారు. మరి 'మాతృభూమి' ట్రైలర్ ఎప్పుడు జనం ముందుకు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

Updated Date - Nov 10 , 2026 | 04:18 PM