సైయారా జోడీతో ఇంటెన్స్ రొమాంటిక్ లవ్ స్టోరీ!
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:51 AM
'సైయారా' టీమ్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈసారి మరింత గాఢమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మోహిత్ సూరి చెబుతున్నారు.
గత యేడాది బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సినిమా 'సైయారా'. సింగిల్ లాంగ్వేజ్‌లో ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 580 కోట్ల గ్రాస్‌ను ఇండియాలో సుమారు రూ. 338 కోట్ల నెట్‌ను వసూలు చేసింది. అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించిన ఈ సినిమాను మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో సినిమాను నిర్మించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెప్పారు. హృదయానికి హత్తుకునే కథనం, మరచిపోలేని మెలోడీలతో ఈ సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నారు.
పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందిన 'సైయారా' చిత్రం ఒక రొమాంటిక్ మ్యూజికల్‌గా అసాధారణమైన విజయాన్ని అందుకుంది. సినిమాలో హృదయాలను హత్తుకునే పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. స్ట్రీమింగ్ చార్ట్స్‌లో ఈ సాంగ్స్ టాప్‌లో నిలిచాయి. దీంతో ఈ సినిమా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నేటి యువతలో, ఒక పాప్ కల్చర్ ఫెనామెనాన్‌గా తన ప్రభావాన్ని బలంగా చూపింది.
అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించిన 'సైయారా' జెన్ జీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దీంతో వీరిని అభిమానులు ప్రేమగా 'అహనీత్' అని పిలిచారు. 'సైయారా'లో వారి మధ్య కనిపించిన చక్కటి కెమిస్ట్రీ, సహజమైన నటన, ఎనర్జీ ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయే అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరోసారి కొత్త చిత్రంతో వారు మళ్లీ రాబోతుండటంతో, అదే చార్మ్, నటన, స్క్రీన్‌పై మళ్లీ కనిపించబోయే కెమిస్ట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ ‘నేను ప్రేమకథలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. భావోద్వేగాలు అతి తీవ్రంగా, నియంత్రణలో లేని స్థితిలో ఉండి, వ్యక్తిని పూర్తిగా ఆక్రమించేసేలా ఉంటే నాకు అవి మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. ప్రేమను గాఢమైన భావనగా నేను భావిస్తాను, అందుకే కథకుడిగా నేను సహజంగానే ఈ జోనర్‌ను ఇష్టపడతాను. మేం చేయబోతోన్న కొత్త సినిమా అలాంటి భావాన్ని అందిస్తుంది. 'సైయారా'లో పనిచేసిన అదే టీమ్‌తో మళ్లీ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. దీన్ని గమనిస్తుంటే ఈ కలయికను మరోసారి విధి రాసిందేమోననిపిస్తోంది. మా కలయికను చూస్తుంటే… ఇంటికి తిరిగి వచ్చినట్లే అనిపిస్తోంది. కానీ కొత్త సృజనాత్మకతను జోడించి ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు.
నిర్మాత అక్షయ్ విధాని మాట్లాడుతూ, 'మోహిత్‌తో పని చేయడం అంటే కేవలం ఒక సినిమా చేయడం కాదు. అది ఒక భావాన్ని వెతకడం, ఒక సంగీత క్షణాన్ని పట్టుకోవడం. సినిమా ముగిసిన తర్వాత కూడా మనసులో నిలిచిపోయే అనుభూతిని సృష్టించడం. 'సైయారా' అలాంటి ఒక అనుభవం. దాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేం. ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నప్పుడు, మేము ఇంకా ఎక్కువ నిజాయితీతో, మరింత భావోద్వేగంతో, మరింత లోతైన కథతో రాబోతున్నాం. మళ్లీ మా కలయిక మరింత సున్నితమైన, మరింత నిలిచిపోయే అనుభవాన్ని ఇవ్వాలన్నదే లక్ష్యం' అని అన్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అహన్, అనీత్ జోడీగా రూపొందనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. 2027లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి:
జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రమాదం