రావణ పాత్రను గడ్డం, మీసాలతో చూపించడంపై విమర్శ
ABN , Publish Date - Aug 16 , 2026 | 10:07 AM
దీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు చెప్పడం కూడా సినిమాటిక్ ఫ్రీడమ్...
దీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు చెప్పడం కూడా సినిమాటిక్ ఫ్రీడమ్... ట్రైలర్ చూస్తోంటే 'రామాయణ'లో రావణ క్యారెక్టర్ హైలైట్ అనిపిస్తోంది... గతంలో వెలసిన రావణ పాత్రలకు 'రామాయణ'లోని ఆ రోల్ కు ఉన్న తేడాలేంటో చూద్దాం...
కొత్తగా చూపించే ప్రయత్నం...
పురాణగాథలను తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే అధిక సంఖ్యాకులకు తెలిసిన కథలను జనం మెచ్చేలా చూపించడం అంత సులువు కాదు... 'రామాయణం' మన భారతీయులకు ఆదికావ్యం. అందువల్ల భారతీయుల్లో అత్యధిక శాతం మందికి ఈ కథ సుపరిచితం. ఈ కథను ఏ మాత్రం తేడాగా చూపించినా, సదరు చిత్రాన్ని జనం దూరం పెడతారు. అందుకు ప్రభాస్ తో తీసిన 'ఆదిపురుష్' తాజా ఉదాహరణ. ఈ చిత్రంలో శ్రీరామ పాత్రలో ప్రభాస్, రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయలేకపోయారనే జనం తీర్పు చెప్పారు. 'ఆదిపురుష్' దర్శకుడు ఓమ్ రౌత్ తన చిత్రంలో రావణ పాత్రను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఆశించిన ఫలితం సాధించలేకపోయారు.
'ఆదిపురుష్' పంథాలోనే...
రావణుడు దశకంఠుడు కాబట్టి ఇప్పటి దాకా 'రామాయణ' గాథను తెరకెక్కించిన వారందరూ ఏదో ఒక సన్నివేశంలో రావణాసురుని పదితలలతో చూపించారు. రావణుడు శివభక్తుడు... పరమశివుని మెప్పించడానికి ఘోరతపస్సు చేశాడు. ఆ సమయంలో కాలం తెలియక సాగాడు. అందువల్ల అతను శిరోజాలు ముళ్ళు పడ్డాయి. గడ్డాలు-మీసాలుపెరిగిపోయాయి... చుట్టూ పుట్టలు పెరిగాయి. ఇలా రావణుని తపస్సును తెరకెక్కించారు పలువురు దర్శకులు. అయితే 'ఆదిపురుష్'లో వైవిధ్యం కోసం అన్నట్టు రావణున్ని మోడరన్ హెయిర్ స్టైల్ తో, బియర్డ్ ను కూడా స్టైల్ గా కట్ చేసి చూపించారు. అదే గెటప్ ను సినిమా మొత్తం చూపించడం గమనార్హం. ప్రస్తుతం 'రామాయణ' దర్శకుడు నితేశ్ తివారీ కూడా అదే తీరున రావణుని గెడ్డం, మీసాలతోనే చూపించారు. గతంలో పౌరాణిక గాథల్లోని వర్ణనల ద్వారా రాజా రవివర్మ వంటి చిత్రకారులు వేసిన పటాల ద్వారా ఆ యా గెటప్స్ రూపొందించేవారు. ఇప్పటి దర్శకులు వైవిధ్యం కోసం సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుని సాగుతున్నారు. అదే పంథా 'రామాయణ'లో యశ్ పోషించిన రావణ పాత్రలోనూ కనిపిస్తోంది.
తెలుగువారి తీరు...
కొందరు దర్శకులు పురాణాల్లోని అంశాలను నవీన పంథాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీకుపురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన 'ది ఒడిస్సీ'ని రూపొందించిన క్రిస్టఫర్ నోలాన్ కూడా అదే తీరున సాగారు. నవతరాన్నీ ఆకట్టుకున్నారు. నితేశ్ తివారీ సైతం జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథను ఈ తరం మెచ్చేలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రావణుని గెటప్ విమర్శలను చవిచూస్తోంది. ఎందుకంటే రావణుడు మహాపండితుడు, సుందరాకారుడు అని పురాణగాథ చెబుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే తెలుగువారు రావణ పాత్రలను రూపొందించారు. పురాణాలను తెరకెక్కించడంలో ఖ్యాతినొందారు తెలుగువారు. మన తెలుగువారికి రావణబ్రహ్మ అనగానే మహానటుడు నటరత్న యన్టీఆర్ ముందుగా గుర్తుకు వస్తారు. 'భూకైలాస్'లో భక్తరావణునిగా యన్టీఆర్ అభినయం విశేషంగా ఆకట్టుకుంది.
వారిద్దరి ప్రభావం...
తెలుగువారు రూపొందించిన పౌరాణికాలు ఉత్తరాది వారిని సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. 'ఇంద్రజిత్, సంపూర్ణ రామాయణం' వంటి చిత్రాల్లో మరో మహానటుడు యస్వీరంగారావు సైతం రావణపాత్రను తనదైన పంథాలో రక్తి కట్టించారు. తెలుగువారికి రావణ అన్న పేరు వినగానే యన్టీఆర్, యస్వీఆర్ ముందుగా గుర్తుకు రావడం కద్దు. అందువల్లే 'రామాయణ' ట్రైలర్ చూసినవారికి యశ్ నటన నచ్చిందే కానీ, ఆయన గెటప్ ను ఇష్టపడడం లేదు.
దుష్ట పాత్ర ద్వారా నీతి...
'రామాయణం'లో ప్రతినాయకుడు రావణ బ్రహ్మ. అది ఓ దుష్టపాత్ర. అయితే ఆ పాత్రద్వారానే లోకానికి ఓ నీతి కూడా లభించింది. పరమశివభక్తుడు, సదాచారి అయిన రావణుడు స్త్రీలోలుడై పరకాంతలను కోరాడు. ఆ నైజమే అతడిని అంతం చేసింది. రావణుని గాథ ద్వారా మనకు తెలిసేదేమంటే పరస్త్రీలను చెరపట్టినవారు నాశనం కాకతప్పరు అన్న సత్యం... ఈ సత్యాన్నే ఇప్పటి దాకా 'రామాయణ'గాథను తెరకెక్కించిన వారందరూ చాటారు. రామారావు, రంగారావు తరువాత సత్యనారాయణ కూడా దుష్టుడైన రావణునిగా నటించి మెప్పించారు
విశిష్టం... రావణ భక్తి...
హిందీ చిత్రసీమలోనూ గతంలో తెరకెక్కిన రామాయణగాథల్లో ప్రేమ్ నాథ్, అరవింద్ త్రివేది, అఖిలేంద్ర మిశ్రా వంటివారు రావణపాత్రను రక్తి కట్టించారు. ఇప్పుడు దక్షిణాది యశ్ తో ఉత్తరాది నితేశ్ తివారీ తన 'రామాయణ'లో రావణ పాత్ర పోషింప చేశారు. గెటప్ లో 'ఆదిపురుష్'నే అనుసరించడంతో విమర్శలు వస్తున్నాయి. తన అభిమాన పాత్ర రావణ అని చెప్పుకున్న యన్టీఆర్ ఆ పాత్రలోని పలు కోణాలను "భూకైలాస్, సీతారామకళ్యాణం, శ్రీకృష్ణ సత్య, శ్రీరామపట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర" వంటి చిత్రాల్లో ఆవిష్కరించారు. అందువల్ల యన్టీఆర్ పాత్ర రూపురేఖలను బట్టే ఉత్తరాదివారు సైతం రావణ పాత్రను చిత్రీకరించారు. నితేశ్ తివారీ సైతం అధ్యయనం చేసి తన రావణుడు ముల్లోకాలను జయించే సీన్స్ ను రక్తి కట్టించినట్టే కనిపిస్తోంది... రావణ పాత్ర దుష్టమే అయినా, అతని భక్తి విశిష్టమే అని ప్రతీతి. దానిని యన్టీఆర్ 'సీతారామకళ్యాణం'లో అద్భుతంగా తెరకెక్కించారు. మరి రావణునిలోని భక్తి తత్త్వాన్ని రాబోయే 'రామాయణ'లో ప్రదర్శించారో లేదో చూడాలి.