రజనీ, షారుక్, ప్రభాస్‌లను దాటేసిన రణ్‌వీర్ సింగ్.. పారితోషికంలో కొత్త చరిత్ర
ABN, Publish Date - Jun 22 , 2026 | 04:58 PM
‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రణ్‌వీర్ సింగ్ రికార్డు సృష్టించారు.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా సరికొత్త రికార్డును సృష్టించారు. ఇంతకీ ఆయన తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల రూ.350 కోట్లు. బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాతో రణ్‌వీర్ ఆర్జించిన ఆదాయమిది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు భాగాలు కలిపి రూ.3200 కోట్ల వసూళ్లను సాధించింది.
అయితే ఇందులో నటించినందుకు రణ్‌వీర్ ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నిర్మాతలతో ఫ్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు సినిమా నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు తన సొంత డబ్బును పెట్టుబడిగా కూడా పెట్టారు. ఫలితంగా లాభాల్లో తన వాటా భారీగా పెరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఆదాయంలో రణ్‌వీర్ వాటా రూ.325 కోట్లు వచ్చాయి. ఒక్క ప్రాజెక్టులో భారతీయ నటుడు ఇంత భారీ మొత్తాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.
వీరందరినీ దాటేసి..
ఇటీవలి కాలంలో రణ్‌వీర్ సింగ్ కంటే ముందు అత్యధిక పారితోషికం అందుకున్నారు రజనీకాంత్. 2024లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘జైలర్’ చిత్రానికి రజనీ రూ.250 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రానికి, ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు రూ.200 కోట్లకు పైగానే తీసుకున్నట్లు సమాచారం.
ఇక బాలీవుడ్‌లో 2023లో షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కో చిత్రానికి రూ.200 కోట్లు పారితోషికాన్ని షారుక్ తీసుకున్నారు. ఇప్పుడు వీరందరినీ దాటేసి దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు రణ్‌వీర్ సింగ్.