శ్రీరాముడిగా.. రణ్‌బీర్ సెట్ అవ్వలేదు! లక్ష్మణ, భరత పాత్రలకు.. సరిపోయేవాడు
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:09 AM
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం టీజర్ విడుదలైన దగ్గరనుంచి అందులో రాముడి లుక్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం టీజర్ విడుదలైన దగ్గరనుంచి అందులో రాముడి లుక్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాముడిగా రణ్‌బీర్ బాగున్నాడని కొందరు, అబ్బే అనుకున్నంతగా లేడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
చాలా ఏళ్ల క్రితం టీవీ సీరియల్‌గా వచ్చిన ‘రామాయణం’లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రీ (Sunil Lahri) మాత్రం రణ్‌బీర్ లుక్ చూసి పెదవి విరిచారు. రాముడిలోని ఆ మృదుత్వం రణ్‌బీర్‌లో లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తన నటనతో అతను మెప్పిస్తాడేమో చూడాలి అని కూడా సునీల్ అన్నారు.
‘రణ్‌బీర్ కొంచెం కఠినంగా కనిపిస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కంటే లక్ష్మణుడి వేషానికో, భరతుడి పాత్రకో సరిపోయేవాడేమోననిపిస్తోంది నాకు. భావోద్వేగాలు పండక పోతే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా అయినా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకోలేదు’ అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఒకటి కాదు.. రెండు పాత్రలు
ఈ సినిమాలో శ్రీరాముడిగానే కాకుండా పరశురాముడి పాత్రను కూడా రణబీర్ పోషిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు దర్శక నిర్మాతలు. అలాగే సినిమా నిడివి ఆరుగంటలు ఉంటుందని రణ్‌బీర్ స్వయంగా ఓ కార్యక్రమంలో తెలిపారు.