'బ్రహ్మాస్త్ర 2' ఓ వైపు... 'యానిమల్ పార్క్' మరోవైపు
ABN, Publish Date - Aug 20 , 2026 | 06:37 PM
రణబీర్ దూకుడు పెంచాడు. రామాయణం పూర్తి చేసిన వెంటనే భారీ సీక్వెల్స్ పై పోకస్ పెట్టబోతున్నాడు. అటు ఇటుగా రెండు ప్రాజెక్టులు ఒకే సారి మొదలయ్యే అవకాశాలు కనిపించడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
రణబీర్ కపూర్ రాబోయే బిగ్ ప్రాజెక్టులతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా 2027 అతని కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతోంది. ముందుగా జనవరి 2027 నాటికి పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ పార్ట్ 2' షూటింగ్‌ను పూర్తి చేయనున్న రణబీర్... ఆ తర్వాత రెండు భారీ సీక్వెల్స్‌తో బిజీ కాబోతున్నాడు. ఒక వైపు 'బ్రహ్మాస్త్ర 2', మరోవైపు 'యానిమల్ పార్క్'. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో మొదలయ్యే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. 'రామాయణ 2' షూటింగ్‌ను జనవరి 2027 నాటికి పూర్తి చేసిన తర్వాత రణబీర్ ఏప్రిల్ 2027 నుంచి 'బ్రహ్మాస్త్ర 2' షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈ సీక్వెల్‌లో రణబీర్.. శివ, దేవ్ అనే రెండు పాత్రల్లో కనిపించనుండగా, ఆలియా భట్ ఇషాగా తిరిగి రానుంది. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఏంటంటే.. అమృత పాత్ర. ఈ రోల్ కోసం దీపిక పదుకొణెతో అయాన్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నారట. చర్చలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్ చాలా పెద్దదిగా, అస్త్రవర్స్‌ను మరింత విస్తరించి భారతీయ పురాణాలను ఎక్స్‌ప్లోర్ చేసేలా ఉండనుందట. ఇటీవల అయాన్ ముఖర్జీ తీసిన 'వార్ 2' ఫ్లాప్ కావడంతో 'బ్రహ్మాస్త్ర 2' ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని, 'బ్రహ్మాస్త్ర -2' ఖచ్చితంగా ఉంటుందని తెలిసింది.
మరోవైపు ఇదే సమయంలో 'యానిమల్ పార్క్' కూడా సెట్స్‌పైకి రానుంది. 'యానిమల్' సినిమా నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ వంగా ఇచ్చిన సూచనల ప్రకారం, సందీప్ వంగా ప్రభాస్ తో చేస్తున్న 'స్పిరిట్' పూర్తయిన తర్వాత 2027 మధ్యలో 'యానిమల్' పార్క్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఒకవైపు 'బ్రహ్మాస్త్ర 2', మరోవైపు 'యానిమల్ పార్క్' రెండూ 2027 మధ్యలో మొదలయ్యే అవకాశం ఉండటంతో రణబీర్ రెండు సినిమాల షూటింగ్‌లో ఏక కాలంలో పాల్గొంటాడా? ఒక దాని తర్వాత ఒకటి చేస్తాడా? అనేది ప్రశ్నగా మారింది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' కూడా రణబీర్ లైనప్‌లో ఉంది. మరి వీటిల్లో వేటికి రణబీర్ తొలి ప్రాధాన్యం ఇస్తాడనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
సొంతూరులో కూరగాయలు అమ్మిన హీరో.. ఏఐ ఫొటోలు కాదండోయ్!
మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్!
Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం