Ramayana: అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి
ABN , Publish Date - Nov 09 , 2026 | 08:56 AM
భారతీయ సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటుకుంటోంది.
భారతీయ సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటుకుంటోంది. బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ‘రామాయణ’ (Ramayana) సినిమా ఇప్పుడు అమెరికాలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా హాలీవుడ్ సినిమాల ప్రచారానికి పెద్దపీట వేసే అమెరికాలో, భారతీయ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సందడి చేస్తున్నాయి. అది కూడా బస్సులపై 'రామాయణ' సినిమా పోస్టర్లు దర్శనమివ్వడం విశేషంగా మారింది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రచారాన్ని భారీగా నిర్వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు అమెరికాలో పలు నగరాల్లో తిరిగే బస్సులపై దర్శనమిచ్చాయి. దీంతో ఆయా నగరాల్లో ప్రయాణిస్తున్న ప్రజల దృష్టిని ‘రామాయణ’ ప్రచార చిత్రాలు ఆకర్షిస్తున్నాయి.
భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయాలని, ప్రపంచం మొత్తం భారతీయ సినిమా గురించి మాట్లాడుకోవాలని ఈ సినిమా తీసినట్లు నిర్మాత నమిత మల్హోత్రా చాలా వేదికలపై చెప్పారు. అందులో భాగంగానే అమెరికాలో కూడా ఈ సినిమా జనాలకు బాగా చేరువకావాలని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 'ఒక భారతీయ సినిమా పోస్టర్ ను అమెరికాలో తిరిగే బస్సులపై చూడటం ఇదే మొదటిసారి' అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సినిమా ప్రచారం విదేశాల్లో ఈ స్థాయిలో జరగడం అభిమానులకు గర్వకారణంగా మారింది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన 'రామాయణ' ఇటీవల విడుదలైంది. విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విజువల్ గా గ్రాండియర్ గా ఉందని, సిజి వర్క్ అద్భుతమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.