Ramayana: 'రామాయణ'పై సీఎం ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 02:24 PM
'రామాయణ' (Ramayana) సినిమాపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra fadnavis) ప్రశంసల వర్షం కురిపించారు.
నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న'రామాయణ' (Ramayana) సినిమాపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra fadnavis) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కకపోతే అకాడమీ జ్యూరీ నిర్ణయంపై తనకు నిరాశ కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నమిత్ మల్హోత్రా ప్రారంభించిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఫడణవీస్ మాట్లాడుతూ 'రామాయణ' సాధారణ సినిమా కాదు. ఇది తరతరాల పాటు గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది. అలాంటి సినిమాకు ఆస్కార్ రాకపోతే అవార్డు జ్యూరీ విషయంలో నేను నిరాశ పడతాను. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ చిత్రానికి ఉంది" అని అన్నారు. గతంలో కూడా ఫడణవీస్ ఈ చిత్రంపై పలు వ్యాఖ్యలు చేశారు. 'భారతీయ సంస్కృతి, పురాణాలు, కళలు, సంగీతానికి ఆధునిక సాంకేతికతను జోడించి ప్రపంచ ప్రేక్షకులకు అందించే ప్రయత్నమే 'రామాయణ' సినిమా. ఈ సినిమా సెట్స్‌ను ప్రధానితో కలిసి సందర్శించినప్పుడు వాటి నిర్మాణ వైభవం చూసి ఆశ్చర్యపోయాను. కొత్త తరానికి భారతీయ ఇతిహాసాలను చేరవేయడానికి ఇలాంటి భారీ చిత్రాలే సరైన వేదిక అవుతాయి' అన్నారు.
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.