RGV: ‘సత్లుజ్‌’ను చూడాలి.. చూపించాలి.. చర్చించాలి..

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:05 PM

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సత్లుజ్‌’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! సెన్సార్‌ సమస్యల వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. అది కూడా రెండు రోజులే ఓటీటీ స్ట్రీమింగ్‌ అయింది.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సత్లుజ్‌’ (Satluj Movie) చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! సెన్సార్‌ సమస్యల వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీలో (Ott)విడుదలైంది. అది కూడా రెండు రోజులే ఓటీటీ స్ట్రీమింగ్‌ అయింది. తదుపరి ఆ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ (RGV) ఈ చిత్రం గురించి స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు.

‘సత్లుజ్‌ సినిమా చూశా. ఇది సినిమా కాదు. ఎన్నటికీ మానని బలమైన గాయం. మన చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని గుర్తు చేస్తుంది. దిల్జీత్‌ దొసాంజే ఈ సినిమా నటన కోసం గుండెలు బాదేసుకోలేదు. ఆ పాత్రకు, మన:సాక్షికి అనుగుణంగా ఎంతో కూల్‌గా చేసుకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో అతని ఆయుధం తుపాకీ కాదు.. అతని అంతరాత్మ మాత్రమే! అర్జున్‌ రామ్‌పాల్‌ నటన అదనపు బలాన్ని ఇచ్చింది. నేరాల్లో వ్యవస్థలు భాగమైన తీరును వాస్తవికతతో చూపించారు. దర్శకుడు హనీ త్రేహాన్‌ ఈ చిత్రాన్ని సంచలనాత్మకంగా కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా మలిచారు. తెరపై అధికార యంత్రాంగ ఫైళ్లు, దహన సంసంస్కారాల వివరాలు, కొన్ని సంభాషణలు ఈ కథలోని తీవ్రతను తెలియజేశాయి. స్వలాభం కన్నా.. నిజాన్ని చెప్పాలని చేసిన ప్రయత్నంతో ఇది మరింత బలంగా తెరపై ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం సొంత పౌరులనే ఎలా బలి తీసుకుంటుంది. సాక్ష్యాలు లేకుండా ఎలా తుడిచిపెడుతుందో ఇప్పుడున్న సినారియోలో సినిమాలో చూపించడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా చుట్టూ ఏర్పడిన వివాదాలే అందుకు నిదర్శనం.

ఈ విషయంలో చిత్ర బృందం తనవంతు బాధ్యతను చక్కగా పూర్తి చేసింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించేదే అసలైన కళ. అత్యంత ధైౖర్యవంతమైన ఫిల్మ్‌ మేకింగ్‌ చేశారు. ఈ సినిమా చాలా మందిని కలవరపెడుతుంది. కొందరిలో అవగాహన కల్పిస్తుంది.. ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం సినిమా అంటే వ్యాపారం. కానీ ఈ సినిమా అలా కాదు. సత్యం, నిజాయతీని సినిమా మాధ్యమం ద్వారా చెప్పినప్పుడు అది ‘సత్లుజ్‌’ అవుతుంది. ఇలాంటి సినిమాను చూడాలి. చూపించాలి. చర్చించాలి. కానీ, సినిమాలో బాధితులను చేసినట్లు ఎన్‌కౌంటర్‌ చేయకూడదు. అధికారంలో ఉన్న వారికి నా విన్నపం ఒకటే. ‘సత్లుజ్‌లో జస్వంత్‌ సింగ్‌ ఖల్రా’ను చేసినట్లు ఈ సినిమాను చేయకండి. నిజాన్ని ఎంత దాచాలనుకుంటే అంత వేగంగా అది బయటకు వస్తుంది’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

Updated Date - Jul 07 , 2026 | 04:23 PM