Ram Gopal Varma: దానికి దిక్కులేదు... వర్మ మరో సినిమా!
ABN, Publish Date - Aug 11 , 2026 | 11:38 AM
'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీ విడుదల కావాల్సి ఉండగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. 'పోలీస్ కంపెనీ' పేరుతో వర్మ తీయబోయే చిత్రాన్ని టి సీరిస్ సంస్థ నిర్మించబోతోంది.
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన నివాసాన్ని తిరిగి ముంబైకు మార్చాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని పరిణామాలతో హైదరాబాద్ వదిలి వర్మ ముంబైకు వెళ్ళాడని అంటున్నారు. నిజానికి 'గోవిందా గోవింద' మూవీ తర్వాత తెలుగు సినిమా రంగంపై అలిగిన వర్మ ముంబైలోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. ఏదో చుట్టపుచూపుగా హైదరాబాద్ వస్తుండేవారు. అయితే హిందీ చిత్రాలు సైతం పరాజయం పాలు కావడం, ఇతర కారణాలతో వర్మ తిరిగి హైదరాబాద్ వచ్చారు. వర్మ హైదరాబాద్ రావడం వెనుక అండర్ వరల్డ్ నుంచి వచ్చిన బెదిరింపులూ ఉన్నాయని కొందరు చెబుతుంటారు. అయితే... మళ్ళీ ముంబైకు చేరిన వర్మ ఇప్పుడు అక్కడో సినిమా తీయబోతున్నారు. అదే 'పోలీస్ కంపెనీ'.
గతంలో వర్మ అండర్ వరల్డ్ మీద స్వీయ దర్శకత్వంలోనూ, నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీశారు. అందులో 'సత్య', 'కంపెనీ' వర్మకు మేకర్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రూట్ మార్చిన వర్మ ముంబై పన్నెండేళ్ళ క్రితం 'అబ్ తక్ చెప్పన్' అనే సినిమాను నిర్మించారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన సబ్ ఇన్ స్పెక్టర్ దయా నాయక్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మళ్ళీ ఇంతకాలానికి వర్మ 'పోలీస్ కంపెనీ'ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిని టీ. సీరిస్ సంస్థ నిర్మించబోతోంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన హర్షవర్థన్ రాణే ఈ మూవీలో దయానాయక్ పాత్ర పోషించబోతున్నాడు.
'పోలీస్ కంపెనీ' అనే టైటిల్ కు కొనసాగింపుగా 'ఇది డి-కంపెనీ కంటే చాలా ప్రమాదకరమైనది' అనే కాప్షన్ ను వర్మ పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే వర్మ ఇప్పటికే 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే సినిమాను తెరకెక్కించారు. రమ్యకృష్ణ, మనోజ్ బాజ్ పాయ్, జెనీలియా, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎన్ కౌంటర్ కు గురైన ఓ వ్యక్తి ఆత్మ పోలీస్ స్టేషన్ కు వస్తే ఏం జరిగిందనే అంశాన్ని బేస్ గా తీసుకుని హారర్ కామెడీగా వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తియినా గానీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి వర్మ 'పోలీస్ కంపెనీ' మూవీని ప్రారంభిస్తానని చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి:
డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: కింగ్ నాగార్జున
నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి: శరత్ కుమార్
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. కనకరాజు కుమ్మేశాడు