సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజ్‌పాల్‌ను ఆదుకుందామంటున్న సోనూసూద్

ABN, Publish Date - Feb 10 , 2026 | 01:27 PM

తీహార్ జైలులో లొంగిపోతూ రాజ్‌పాల్‌ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పలువురి మనసుల్ని కదిలించాయి. ముఖ్యంగా సోనూసూద్ చిత్రసీమలోని దర్శక నిర్మాతలు, నటీనటులు రాజ్‌పాల్‌ యాదవ్ ను ఆదుకోవాలని కోరారు.

Sonu Sood - Rajpal Yadav

ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav) చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలులో కొద్ది రోజుల క్రితం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు నుండి ఉపశయమనం కల్పించాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళగా, దాన్ని తిరస్కరించిన న్యాయమూర్తి లొంగిపోవాల్సిందేనని తెలిపారు. దాంతో గత్యంతరం లేక రాజ్‌పాల్‌ కోర్టుకు లొంగిపోయాడు.

రాజ్‌పాల్‌ యాదవ్ 2010లో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాడు. ఆ సమయంలో మురళీ ప్రాజెక్ట్స్ ప్రై. లి. సంస్థ నుండి ఐదు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. సినిమా ఫ్లాప్ కావడంతో అప్పు తీర్చలేక చేతులెత్తేశాడు. అప్పుడు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో మురళీ ప్రాజెక్ట్స్ సంస్థ కోర్టు కెక్కింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. 2018లో మేజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్‌ యాదవ్, ఆయన భార్యను దోషులుగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీలు చేసినప్పటికీ కేసు సంవత్సరాల పాటు కొనసాగింది. వడ్డీ, జరిమానాలతో కలిపి బకాయి మొత్తం దాదాపు రూ.9 కోట్లకు చేరింది. ఈ బకాయిలను చెల్లించేందుకు ఢిల్లీ హైకోర్టు పలు అవకాశాలు ఇచ్చింది. 2024 ఆయన శిక్షను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఆ తర్వాత కూడా కేవలం 75 లక్షల రూపాయలను మాత్రమే చెల్లించినట్టు తెలిసింది. ఇక ఈ యేడాది ఫిబ్రవరి 4న నిధులు సమకూర్చుకునేందుకు ఓ వారం గడువు ఇవ్వాలని రాజ్‌పాల్‌ యాదవ్ కోరినా కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడానికి సిద్థమయ్యాడు.


ఈ సందర్భంగా రాజ్‌పాల్‌ తన దగ్గర డబ్బులు లేవని, తనను ఒడ్డున వేసే స్నేహితులు కూడా ఎవరూ లేరంటూ నిస్సహాయత వ్యక్తం చేశాడు. తాజాగా రాజ్‌పాల్ యాదవ్ ఉదంతంపై ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసూద్ (Sonusood) స్పందించాడు. రాజ్‌పాల్ యాదవ్ ప్రతిభావంతమైన నటుడని, ఒక్కోసారి కాలం కలిసి రాక ఎంతటి ప్రతిభావంతులైన ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నాడు. ఈ కష్టకాలంలో అతనికి దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులు బాసటగా నిలవాలని, ఎవరికి తోచి మొత్తం వారు ఇచ్చి ఆదుకోవాలని, దీనిని దానంగా కంటే గౌరవంగా భావించాలని సోనూసూద్ కోరాడు. మనలో ఒకరు కష్టంలో ఉంటే వారు ఒంటరి కాదని చిత్రపరిశ్రమ గుర్తు చేయాలని ఆయన అన్నాడు. మరి సోనూసూద్ విజ్ఞప్తిని ఎంతమంది ఆచరిస్తారో చూడాలి.

Updated Date - Feb 10 , 2026 | 01:53 PM