Radhika Apte: ఆ బోల్డ్ వీడియో చూసిన తర్వాత నన్ను అలా చూడటం మొదలుపెట్టారు
ABN, Publish Date - Sep 24 , 2026 | 05:51 PM
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 3’ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ " నాకు సంబంధించిన ఓ ప్రైవేట్ ఇంటిమేట్ క్లిప్ లీక్ కావడంతో నేను తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏకంగా నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేకపోయాను. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వెళ్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నాలో మొదలైంది. ఆ సమయంలో ఇంట్లోనే ఉండటం తప్ప మరో మార్గం కనిపించలేదు. అంతటితో ఆ సమస్య ఆగిపోలేదు. వీడియో బయటకు వచ్చిన తర్వాత కొందరు నన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు.. ఆ వీడియో చూసిన తర్వాత కొందరు నన్ను గతంలో కంటే పూర్తిగా భిన్నమైన దృష్టితో చూడటం ప్రారంభించారు. అది నాకు చాలా అసౌకర్యంగా, బాధగా అనిపించింది. నేను ఒక నటిని. తెరపై నేను చేసే పాత్రలు, నా నిజ జీవితానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో బోల్డ్‌గా కనిపించవచ్చు.. కొన్ని పాత్రలు ఇంటిమేట్ సన్నివేశాలతో ఉండవచ్చు. కానీ సినిమాలో నేను పోషించే పాత్ర ఒకటి.. నిజ జీవితంలో నేను మరొకటి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను.
ఒక వ్యక్తిగత విషయం అనుకోకుండా బయటకు వస్తే.. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో నేను స్వయంగా అనుభవించాను. ఆ ఘటన తర్వాత నేను ఎదుర్కొన్న పరిస్థితులు నాకు చాలా బాధను కలిగించాయి. సెలబ్రిటీ అయినంత మాత్రాన మా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన హద్దులు ఉండకూడదని కాదు. మేము కూడా మనుషులమే. మా వ్యక్తిగత విషయాలకు, మా ప్రైవసీకి గౌరవం ఉండాలి" అని అన్నారు.