Pradeep Rawat: కంట తడి పెట్టిస్తున్న ప్రదీప్ రావత్ తనయుడి మాటలు..
ABN, Publish Date - Aug 06 , 2026 | 11:33 AM
బిక్షు యాదవ్.. (సై) రాజ్ బీహారీ.. బీహార్ కా షేర్.. (ఛత్రపతి) మహర్షి (నేను శైలజా) డేవిడ్ (వాల్తేరు వీరయ్య) ఇలా సినిమాల్లో ఆయన పోషించిన క్యారెక్టర్ల పేరుతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు ప్రదీప్ రావత్.
బిక్షు యాదవ్.. (సై)
రాజ్ బీహారీ.. బీహార్ కా షేర్.. (ఛత్రపతి)
మహర్షి (నేను శైలజా)
డేవిడ్ (వాల్తేరు వీరయ్య).. ఇలా సినిమాల్లో ఆయన పోషించిన క్యారెక్టర్ల పేరుతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు ప్రదీప్ రావత్(Pradeep Rawat). ‘సై’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆయన స్టార్ హీరోలు అందరి సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి మెప్పించారు. అంతే కాదు ఆయనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని పలు చిత్రాలతో నిరూపించారు. ‘నేను శైలజా’లో మహర్షి పాత్ర అందుకు నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతోపాటు ఒరియా, బెంగాళీ, నేపాలీ, భోజ్‌పురి భాషల్లో నటించారు. అంతేకాదు నైట్‌ఫాల్ వంటి ఇంగ్లీష్ చిత్రంలోనూ భాగమై అలరించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబయిలోని ఓషివారా శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఆమిర్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వచ్చి నివాళులర్పించారు.
అయితే చివరి రోజుల్లో అనుభవించన వేదన, ఐసీయూలోని ఆఖరి క్షణాలను గుర్తుచేసుకుంటూ ప్రదీప్ రావత్ కుమారుడు విక్రమాదిత్య భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత విక్రమ్ మీడియాతో మాట్లాడారు. ‘నాన్న చాలా హెల్దీగా ఉండేవారు. మొదట ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అనుకున్నాం. కానీ నిర్లక్ష్యం చేయకుండా అన్ని టెస్టులు చేయించి డాక్టర్‌ను సంప్రదించాం. మెడిసిన్స్ ఇచ్చినా పపని చేయలేదు. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించిందని అమ్మ ఫోన్ చేసింది. మళ్లీ పరీక్షలు చేయించగా.. బాడీలో తెల్ల రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. తదుపరి ఆయనను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించాం. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ఆ మాట వినగానే అంతా కుప్పకూలిపోయాం. ఇది అరుదైన క్యాన్సర్, వేగంగా శరీరమంతా విస్తరిస్తుంది. రెండు నెలల క్రితమే నాన్నకు అన్నీ పరీక్షలు చేయించాము. రిపోర్ట్స్ నార్మల్‌గా వచ్చాయి. కానీ ఒకటిన్నర నెలలో అంతా వింతగా అయిపోయింది' అని విక్రమాదిత్య కన్నీరుమున్నీరయ్యారు. ఐసీయూ చివరి క్షణాల గురించి చెబుతూ ‘డాక్టర్లు మమ్మల్ని పిలవడంతో ఐసీయూ వైపు పరిగెత్తాం. అప్పుడు వైద్యులు నాన్నకి సీపీఆర్ చేస్తున్నారు. అది చూడగానే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది. అవే నాన్న ఆఖరి క్షణాలని, ఆశలు లేవని నాకు అర్థమైంది. ఆ సమయంలో అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. చూస్తుండగానే అంతా అయిపోయింది. నాన్న మమ్మల్ని విడిచివెళ్లిపోయారు’ అని తెలిపారు.