సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వార్ మూవీస్‌కు ఆదరణ.. వాస్తవాలేమిటీ!?

ABN, Publish Date - Mar 25 , 2026 | 05:07 PM

పాకిస్తాన్‌ థియేటర్లలో కొంతకాలంగా ఇండియన్ స్పై మూవీస్ ప్రదర్శన నిలిచి పోయింది. అయితే వార్ చిత్రాలను పాక్ జనం విశేషంలో ఓటీటీలో వీక్షిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

War movies

'శత్రువును సైతం అభిమానిస్తున్నారు' అంటే అభిమానించేవారు గొప్పవారై ఉండాలి. లేదా వారు శత్రువుగా భావించేవారే మహానుభావులవ్వాలి. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే - మన ఇండియన్ వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్‌ను పాకిస్థాన్ ప్రజలు విశేషంగా చూస్తున్నారట!

అఖండ భారత్ నుండి విడిపోయిన దగ్గర నుంచీ పాకిస్థాన్ మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వీలు దొరికినపుడల్లా దాడులు చేసే ప్రయత్నం సాగిస్తోంది. అలా తెగబడి 1971 యుద్ధంలో ఓటమి చవిచూసింది. అలాగే కార్గిల్ వార్ లోనూ తోకముడిచింది. అయినా ఇప్పటికీ దాయాది మత్సరం చూపిస్తూనే ఉంది. అయితే అక్కడి సామాన్య జనం మాత్రం మన ఇండియన్ మూవీస్ పై ఎంతో అభిమానం పెంచుకొనేవారు. 2019 నుండి మన భారతీయ చిత్రాలను పాకిస్థాన్‌లో అనధికారికంగా థియేటర్లలో ప్రదర్శించడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం మన సినిమాలను అక్కడి జనం విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ పై దాడి చేసి విజయం సాధించిన వార్ మూవీస్ ను పాక్ ప్రజలు ఆసక్తిగా తిలకించడం మరింత విశేషమనే చెప్పాలి. అలా "బోర్డర్ 2, ధురంధర్, తల్వార్, రాజీ" వంటి వార్ - స్పై మూవీస్ పాక్ జనాన్ని ఆకట్టుకుంటున్నాయట.


వాస్తవానికి మన దేశంలో రూపొందే వార్ మూవీస్ లో తప్పకుండా పాకిస్థాన్ పై మనం పైచేయి సాధించిన అంశాలే ఉంటాయి. అలాంటప్పుడు సదరు చిత్రాలకు పాక్ లో ఎటూ థియేట్రికల్ రిలీజ్ ఉండదు. అయినా మన వార్ మూవీస్ పైనా, స్పై పిక్చర్స్ పైనా పాకిస్థానీయులు సైతం ఆసక్తి పెంచుకోవడం గమనార్హం. 'ధురంధర్' చిత్రంలోని కథాంశాన్ని అనుసరించి 'గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్' ఆ సినిమాను తమ దేశాల్లో నిషేధించాయి. పాక్ లో 'ధురంధర్' రిలీజ్ కాకపోయినా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది కాబట్టి ఆ సినిమాను పాకిస్థానీయులు విశేషంగా ఆదరిస్తున్నట్టు స్ట్రీమింగ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ఇక 'ధురంధర్-2'ను కూడా పైరసీ సైట్స్ నుండి డౌన్ లోడ్ చేసుకొని మరీ పాక్ జనం వీక్షిస్తున్నారట.


'ధురంధర్' సినిమా సిరీస్ ప్రభంజనం పాకిస్థాన్ లో విశేషంగా వీస్తోంది. అక్కడ ఈ సినిమాలు రిలీజ్ కాకపోయినా వాటిని పాక్ ప్రజలు వీక్షించారన్నది నిర్వివాదాంశం. అంతెందుకు పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం సయ్యద్ అఫ్రిదీ సైతం 'ధురంధర్-2' సినిమాపై స్పందించడం విశేషంగా మారింది. 'ధురంధర్-2'ను ఆయన చూశారో లేదో కానీ, ఆ సినిమా ప్రభావం వల్ల పాకిస్థాన్‌లో ఒకరిపై ఒకరికి నమ్మకం పూర్తిగా పోయిందని అఫ్రిదీ కామెంట్ చేశారు. ఎవరు మనవాళ్ళు, ఎవరు భారత్ ఏజెంట్స్ అని తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆఫ్రిది అన్నారు. దీనిని బట్టే 'ధురంధర్' సిరీస్ క్రియేట్ చేసిన సంచలనం ఏ పాటిదో అర్థమవుతోంది. ఇంతకూ పాకిస్థాన్ ప్రజలు మన ఇండియన్ మూవీస్ ను ఎందుకు ఇష్టపడతారు? - మన సినిమాల్లోని హై-ఓల్టేజ్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ వంటివి పాక్ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఓటీటీల్లో ఇంకా ఎన్ని ఇండియన్ మూవీస్ పాక్ ప్రజలను అలరిస్తూ సాగుతాయో చూడాలి.

Updated Date - Mar 25 , 2026 | 05:07 PM