Bollywood: త్వరలో పట్టాలెక్కబోతున్న 'ఓ.ఎం.జీ. - 3'
ABN, Publish Date - Jan 02 , 2026 | 04:16 PM
అక్షయ్ కుమార్ కు మంచి విజయాన్ని అందించిన 'ఓఎంజీ' ఫ్రాంచైజ్ లో మూడో సినిమా ఈ యేడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమాలో రాణీముఖర్జీ హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో అమిత్ రాయ్ (Amith Rai) తెరకెక్కించిన 'ఓ మై గాడ్' ఫ్రాంచైజ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో మొదటిదైన 'ఓ.ఎం.జీ.' మూవీ అయితే తెలుగులోనూ 'గోపాల గోపాల' పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 'ఓ మై గాడ్'కు దక్కిన విజయం కారణంగా ఆ తర్వాత అక్షయ్ కుమార్, అమిత్ రాయ్ 'ఓ.ఎం.జీ. 2' సినిమాను తెరకెక్కించారు. అప్పటి నుండి అందరూ దీని ఫ్రాంచైజ్ లో మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. వారందరి కోరిక త్వరలోనే తీరబోతోంది.
ప్రస్తుతం 'ఓ.ఎం.జీ 3' ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు అమిత్ రాయ్ స్క్రీప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు. ఈ యేడాది మిడిల్ లో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో నాయికగా రాణీ ముఖర్జీ (Rani Mukerji) ని ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ఇప్పటికే రాణీ ముఖర్జీ తనకు యాక్షన్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టిన 'మర్దానీ' (Mardaani) ఫ్రాంచైజ్ లో మూడో సినిమా చేస్తోంది. అది ఇదే యేడాది ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అలానే షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలోనూ రాణీ ముఖర్జీ అతిథి పాత్రలో మెరియబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా 'ఓఎంజీ 3'లో చేయడంతో సహజంగానే ఆ మూవీపై మరింత క్రేజ్ పెరగడానికి కారణమైంది. మరి ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన మొదటి రెండు సినిమాలను మించిన విజయాన్ని 'ఓఎంజీ 3' అందుకుంటుందేమో చూడాలి.