'ధురంధర్' కాదు.. ఇప్పటివరకు ఇండియాలో భారీ నిడివి సినిమాలివే
ABN, Publish Date - Mar 21 , 2026 | 08:39 AM
సినిమా సక్సెస్‌కు లెన్త్ అడ్డంకి కాదు అని 'ధురంధర్-ద రివేంజ్' మరోమారు చాటింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సైతం రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా గ్రాండ్ సక్సెస్ చూసింది. నిడివి ఎక్కువుంటే సక్సెస్ గ్యారంటీనా?.
రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' మొదటి భాగం 3 గంటల 34 నిమిషాల రన్ టైమ్ తో రిలీజయింది. గత సంవత్సరం డిసెంబర్ 5న వచ్చిన 'ధురంధర్' ఘనవిజయం సాధించింది. 1350 కోట్ల రూపాయలు పోగేసి, లాస్ట్ ఇయర్ వెయ్యి కోట్లు చూసిన ఏకైక చిత్రంగా నిలచింది 'ధురంధర్'. ఆ సినిమా సీక్వెల్ గా మార్చి 19న విడుదలైన ధురంధర్- ద రివేంజ్ (Dhurandhar: The Revenge)కూడా 3 గంటల 49 నిమిషాల ప్రదర్శనా కాలంతో రూపొందింది. ఈ చిత్రం సైతం సక్సెస్ టాక్ తో సాగిపోతోంది. అందువల్ల సినిమా సక్సెస్ కు నిడివి అడ్డంకి కాదని 'ధురంధర్-2' మరోమారు నిరూపించిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. పాత రోజుల్లో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలకే జనం పరుగులు తీసేవారనీ గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా 'ధురంధర్-2' సక్సెస్ పలువురికి ఉత్సాహం కలిగిస్తోంది.
మన దేశంలో మూడున్నర గంటల రన్ టైమ్ తో తెరకెక్కిన తొలి చిత్రం 1932లో రూపొందిన 'ఇంద్రసభ' అనే చెప్పాలి. ఈ సినిమా 211 నిమిషాల ప్రదర్శనా కాలంతో సాగింది. ఇందులో 72 పాటలున్నాయట. ఆ రోజుల్లో ఆ పాటలు చూసేందుకే జనం థియేటర్లకు పరుగులు తీశారు. ఈ నాటికీ ప్రపంచంలో అన్ని పాటలతో రూపొందిన ఏకైక చిత్రంగా 'ఇంద్రసభ' నిలచే ఉంది. ఇక తెలుగులో యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి, దర్శకత్వం వహించిన 'దానవీరశూర కర్ణ' సినిమా అత్యంత నిడివిగల చిత్రంగా చెక్కుచెదరలేదు. 1977లో విడుదలైన 'దానవీరశూర కర్ణ' ఘనవిజయం సాధించింది. అంతకు ముందు 1957 నాటి 'సువర్ణసుందరి', 1958లో వచ్చిన యన్టీఆర్ 'సంపూర్ణ రామాయణం', 1963లో వెలుగు చూసిన తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ' కూడా మూడున్నర గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలే... ఇవన్నీ ఘనవిజయాలు సాధించినవే కావడం విశేషం. ఈ మధ్యకాలంలో 'పుష్ప-2' మూడు గంటల ఇరవై నిమిషాల రన్ టైమ్‌తో ఘనవిజయం సాధించింది. ఇలా ప్రదర్శనా కాలం ఎంత ఎక్కువైనా కనికట్టు చేసిన చిత్రాలు ఉన్నాయి.
నిడివి గల చిత్రాలన్నీ విజయపథంలో పయనించలేదు. కొన్నిసార్లు ప్రదర్శనాకాలం ఎక్కువ ఉండడం వల్ల బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలూ ఉన్నాయి. అలాంటి వాటిలో మన భారతీయులు ముందుగా గుర్తు చేసుకొనే చిత్రం రాజ్ కపూర్ నటించి, దర్శకత్వం వహించిన 'మేరా నామ్ జోకర్'. 1970లో వెలుగు చూసిన 'మేరా నామ్ జోకర్' 4 గంటల 8 నిమిషాల రన్ టైమ్ తో రిలీజయింది. జనానికి బోర్ కొట్టడంతో ఈ మ్యూజికల్ ఆకట్టుకోలేక పోయింది. తరువాతి రోజుల్లో ట్రిమ్ చేసిన వర్షన్ అభిమానులను అలరించింది. ఏది ఏమైనా ప్రేక్షకులను కట్టిపడేసే కథ, కథనం ఉంటే తప్పకుండా నిడివిగల చిత్రాలనూ ఆదరిస్తారు. అలా కట్టిపడేయని సినిమాలు 12 రీళ్ళలో తీసినా పరాజయం పాలయిన సందర్భాలు బోలెడున్నాయి. 'ధురంధర్' రెండు భాగాలు అతి నిడివిగల చిత్రాలే. రెండూ ఘనవిజయం సాధించాయి. ఈ సినిమాల స్ఫూర్తితో ఇంకెందరు నిడివిగల చిత్రాలు రూపొందిస్తారో చూడాలి.