రూ. 3 కోట్ల నోటీసులు.. అంత నోటిదూల ఎందుకమ్మా నోరా
ABN, Publish Date - Sep 08 , 2026 | 08:49 PM
ఒకప్పుడు సెలబ్రిటీలు ఎవరు ఎలా మాట్లాడినా పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఒక్క చిన్న మాట ఎక్కువ మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
ఒకప్పుడు సెలబ్రిటీలు ఎవరు ఎలా మాట్లాడినా పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఒక్క చిన్న మాట ఎక్కువ మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అందుకే ఈమధ్యకాలంలో సెలబ్రిటీలు ఏది మాట్లాడాలన్నా.. ఏది పోస్ట్ చేయాలన్నా కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి నోటి దూల వలన రూ. 3 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేమయ్యింది అంటే.. బాలీవుడ్ నటి, స్టార్ డాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) ఇటీవల ముంబై నుంచి జైపూర్ ప్రయాణం కోసం ఆమె ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానాన్ని బుక్ చేసుకుంది. అయితే, ఆ ప్రయాణ అనుభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది. తాను ప్రయాణించిన విమాన పరిమాణం, సౌకర్యాలను ఎద్దేవా చేస్తూ దాన్ని టాయ్ కార్, లేగో ప్లేన్ (ఆటబొమ్మ విమానం) అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది.
మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నోరా ఫతేహి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి. దీంతో సదరు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ వ్యాపార ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆరోపిస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థపై నోరా చేసిన అవాస్తవ ప్రచారం వల్ల కంపెనీ బుకింగ్స్ దాదాపు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయాయని, ఇది తమకు భారీ ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందని సదరు ఏవియేషన్ సంస్థ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా తమ బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించుకోవడానికి, తమకు జరిగిన నష్టానికి పరిహారంగా నోరా ఫతేహి రూ. 3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు సంస్థ పరువు నష్టం దావా వేసింది. అది మాత్రమే కాకుండా సోషల్ మీడియా నుంచి ఆ వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలని, కంపెనీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని దావాలో పేర్కొంది.
ఇక నోరా ఫతేహి వైపు నుంచి ఈ లీగల్ నోటీసులపై ఎలాంటి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అయితే, ఒక వైపు వరుస స్పెషల్ సాంగ్స్, సినిమాలతో బిజీగా ఉన్న నోరాకు ఈ కోర్టు దావా ఊహించని షాక్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు వ్యాపార సంస్థలపై ఎంతటి ప్రభావం చూపుతాయో అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. అంతా నోటి దూల ఎందుకమ్మా నోరా.. ఇప్పుడు చూడు రూ. 3 కోట్లు కట్టాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.