Nora Fatehi: బూతుపాట.. క్షమాపణలు చెప్పిన నోరా
ABN, Publish Date - May 08 , 2026 | 06:34 AM
‘కేడీ: ద డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునర్’ పాటలో మహిళలను కించపరిచేలా అసభ్యకరమైన పదాలు, నృత్యాలు ఉండడంతో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ధ్రువ సర్జా (Dhruva Sarja), సంజయ్ దత్ (Sanjay Dutt)ప్రధాన పాత్రధారులుగా నోరా ఫతేహి (Nora fathehi) ప్రత్యేక పాటలో తెరకెక్కిన చిత్రం ‘కేడీ: ద డెవిల్’ (KD The Devil). ఈ చిత్రంలోని ‘సర్కే చునర్’ (Sarke Chunar Teri Sarke) పాటలో మహిళలను కించపరిచేలా అసభ్యకరమైన పదాలు, నృత్యాలు ఉండడంతో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే.. నోరా ఫతేహి గురువారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ (Delhi Commission for Women) ఎదుట హాజరై రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం లేదు. నటిగా నా బాధ్యత నాకు తెలుసు. అందుకే క్షమాపణలు తెలిపాను. దిద్దుబాటు చర్యగా కొంతమంది అనాథ బాలికల చదువుకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నాను’ అని పేర్కొన్నారు.
ఇదే విషయమై గత నెలలో సంజయ్ దత్ సైతం మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు తెలియజేశారు . తన వంతు దిద్దుబాటు చర్యగా 50 మంది ఆదివాసీ బాలికల విద్యకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ చిత్రం నిర్మాణ సంస్థ ప్రతినిధులు గౌతమ్ కేఎమ్, సుప్రీత్, ఈ పాట రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు కిరణ్‌కుమార్ (ప్రేమ్)తో పాటూ ఈ గీతానికి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా మహిళా కమిషన్ ముందుట హాజరై క్షమాపణలు తెలిపారు.