సుశాంత్ సింగ్.. మాజీ మేనేజర్ కేసులో కొత్త ట్విస్టు
ABN, Publish Date - Sep 18 , 2026 | 09:02 AM
దిశా సాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర నేత ఆదిత్య ఠాక్రే, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద మృతి కేసులో మహారాష్ట్ర (Maharashtra) మాజీ మంత్రి, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray)కు రూ. 500 కోట్ల లీగల్ నోటీసు జారీ అయింది. ఆయనతో పాటు ఎన్సీపీ(ఎస్ పీ) నేత, మాజీ హోంమంత్రి అనిల్ దేశ ముఖ్ (Anil Deshmukh)కు కూడా నోటీసులు అందాయి.
కుమార్తె మరణంపై తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, తప్పుడు ఆరోపణలతో ఇద్దరు నేతలు తన ప్రతిష్ఠ దిగజార్చారని ఆరోపిస్తూ దిశా సాలియన్ తండ్రి సతీశ్ నష్టపరిహారం కోరారు. తనకు క్షమాపణలు చెబుతూ అన్ని ప్రధాన పత్రికలు, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం పైనుంచి పడి దిశా సాలియన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తొలుత ఇందులో ఎలాంటి నేరకోణం లేదని చెప్పిన దిశ తండ్రి, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ఇటీవల బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించారు.
ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియాలతో పాటు పలువురు ప్రముఖులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆదిత్యఠాక్రే పాత్రపై విచారణ అవసరమని ఎఫ్ ఐఆర్ పేర్కొంది. కాగా, ఈ ఆరోపణలపై ఆదిత్యఠాక్రే స్పందిస్తూ... తనకు దిశా సాలియన్ తో ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు.