ఐశ్వర్య, అభిషేక్.. ఈ ఫొటోతోనైనా నెగిటివ్ ప్రచారం ఆగుతుందా
ABN, Publish Date - Apr 21 , 2026 | 08:35 PM
ఎక్కడా లేని వివాదాలు, సంచలనాలు గ్లామర్ ఇండస్ట్రీలోనే పుడుతుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ ఎంత వేగంగా వ్యాపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడా లేని వివాదాలు, సంచలనాలు గ్లామర్ ఇండస్ట్రీలోనే పుడుతుంటాయి. ఇక్కడ కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ గా ఎదిగితే, మరికొందరు అనవసరమైన వార్తలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) కెరీర్ లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో ఆమె విడాకుల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఐష్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు.
అసలు ఈ విడాకుల గోల ఎక్కడ మొదలైంది..? ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)ల మధ్య దూరం పెరిగిందని అందరూ ఎందుకు చర్చించుకున్నారు..? దీనికి ప్రధాన కారణం కొన్ని ఫంక్షన్లలో వారు విడివిడిగా కనిపించడమే. ఒకే కార్యక్రమానికి ఐశ్వర్య తన కూతురు ఆరాధ్య (Aaradhya) తో రావడం, అభిషేక్ బచ్చన్ తన కుటుంబ సభ్యులతో విడిగా రావడం చూసి నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు. ముఖ్యంగా ఒక పెద్ద వేడుకలో బచ్చన్ కుటుంబం అంతా కలిసి ఫోటోలకు పోజులిస్తే, ఐశ్వర్య మాత్రం ఆరాధ్యతో సెపరేట్‌గా కనిపించడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.
దీంతో బచ్చన్ కోడలు ఆ ఇంట్లో ఉండటం లేదని, విడాకులు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి సెలబ్రిటీలు తాము కలిసే ఉన్నామని నిరూపించుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది. గతంలో ఆరాధ్య స్కూల్ యాన్యువల్ డే వేడుకలో అభిషేక్, ఐశ్వర్య కలిసి పాల్గొన్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయినా కూడా రూమర్ రాయుళ్లు వెనక్కి తగ్గలేదు. అది కేవలం కూతురు కోసమే కలిశారని, వారి మధ్య బంధం బలహీనపడిందని కథనాలు అల్లారు. ఇలాంటి నెగిటివిటీ మధ్య ఐశ్వర్యరాయ్ మౌనంగానే ఉంటూ సమయం కోసం వేచి చూశారు.
సరిగ్గా తమ వివాహ బంధానికి 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐష్ ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు. తన భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న ఆ సెల్ఫీని చూసి విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పటికీ తాము ఒకే తాటిపై ఉన్నామని ఆ ఒక్క ఫోటోతో స్పష్టం చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఆ పిక్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఈ ఫోటో చూశాకైనా నెగిటివ్ ప్రచారం చేసేవారు ఆగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు కామన్. కాకపోతే వ్యక్తిగత విషయాల్లో మరీ ఇంతగా జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం. ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటో బచ్చన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.