Ramayan: రావణపాత్రను విలన్ గానే చూపించాలని డిమాండ్

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:21 PM

ఈ తరానికి అసలు పురాణ పరిజ్ఞానం ఎంత ఉందో తెలియదు. కానీ, తాము చెప్పిందే వేదం అంటున్నారు. పురాణ పాత్రలను తమకు నచ్చినట్టు చూపించాలనీ డిమాండ్ చేస్తున్నారు.

Ramayana Movie

భారతీయులు అతిపవిత్రంగా భావించే రామాయణగాథ మరోమారు తెరకెక్కుతోంది. 'దంగల్' దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న 'రామాయణ' (Ramayana) లో శ్రీరామునిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణునిగా యశ్ (Yash), సీతగా సాయిపల్లవి (Saipallavi) నటిస్తున్నారు. రావణ పాత్ర ఎంతో వైవిధ్యమైనదని, అందులో పలు కోణాలు ఉన్నాయని, ఆ పాత్రను పోషించడం తనకో ఛాలెంజ్ అని ఇటీవల యశ్ అన్నారు. రావణపాత్రను గొప్పగా చెప్పాడంటూ యశ్ పై ట్రోల్స్ సాగుతున్నాయి. నెటిజెన్స్ అంతటితో ఆగలేదు - 'రామాయణ'లో రావణ పాత్రను ఫక్తు విలన్ గానే చూపించాలనీ డిమాండ్ చేస్తున్నారు. నవతరం ప్రేక్షకులకు పురాణలపై ఏ పాటి అవగాహన ఉందో అర్థమవుతోంది. రావణుడు పరమ శివభక్తుడు. రావణ ప్రోక్త శివస్తోత్రం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనేఉంది. అంతటి రావణుడు సైతం పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయ్యాడు అన్న నీతినే 'రామాయణం' చాటుతోంది. దానినే సినిమాల్లోనూ చూపిస్తున్నారు. గతంలోనూ ఎందరో మహానటులు ఈ పాత్రను ఓ సవాల్ గా తీసుకొని పోషించి మెప్పించారు.


అసలు పౌరాణికాలను తెరకెక్కించడంలో తెలుగువారే ఘనులు అనే ఖ్యాతి ఉంది. రామాయణ, భారత, భాగవతాలను మన తెలుగువారు అనితరసాధ్యంగా రూపొందించి రక్తి కట్టించారు. ఇక 'రామాయణం'లోని రావణ పాత్ర విషయానికి వస్తే - తెలుగునాట నటరత్న యన్టీఆర్ (NTR), నటచక్రవర్తి యస్వీఆర్ (SVR), నవరస నటసార్వభౌమ సత్యనారాయణ (Satyanarayana) వంటి మేటి నటులు ఆ పాత్రను పోషించి మెప్పించారు. రావణ పాత్రలో ఎవరికి వారు తమదైన బాణీ పలికించారు. యన్టీఆర్ గెటప్స్ చూసిన తరువాతే 'రామాయణ' సీరియల్ లోనూ రావణాసురుని పాత్రను రూపొందించారు రామానందసాగర్. ఇలాంటి విషయాలు ఈ తరం వారిలో ఎందరికి తెలుసు...!?

'రామాయణ'లో రావణ పాత్రకోసం యశ్ ను ఎంపిక చేసినప్పటి నుంచీ ఆయనపై ట్రోల్స్ సాగుతూ ఉండడం గమనార్హం ! 'రామాయణ'లో రావణ పాత్రకు యశ్ సరైన ఎంపిక అని దర్శకుడు నితేశ్ తివారీ చెప్పినా, కొందరు ఉత్తరాదివారు ఆ పాత్రలో రణవీర్ సింగ్ అయి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు రావణ పాత్ర గురించి యశ్ తన అభిప్రాయాన్ని చెప్పగానే అందులో తప్పులు పడుతున్నారు నెటిజెన్స్. దీనిని బట్టి నార్త్, సౌత్ అన్న ఫీలింగ్ తోనే యశ్ ను ట్రోల్ చేస్తున్నారని చెప్పవచ్చు.


రావణ పాత్ర ఓ ఛాలెంజ్ అన్న మాటకే యశ్ ను ట్రోల్ చేస్తున్నారు. మహానటుడు యన్టీఆర్ సైతం తన అభిమాన పాత్ర రావణ అని ప్రకటించారు. అంతే కాదు ఆరు సార్లు రావణునిగా తెరపై కనిపించి అలరించారు నటరత్న. రావణ పాత్రలో దాగి ఉన్న భక్తిభావాన్ని, మొండితనాన్నీ, దుర్మార్గాన్నీ అన్నిటినీ ఆవిష్కరించారు యన్టీఆర్. ఓ పురాణ పాత్రను ఓ నటుడు ఎంతలా రక్తి కట్టించారో చూడాలి. అంతే కానీ, ఆ పాత్ర దుష్టపాత్రయినంత మాత్రాన దానిని పోషించే నటుడి అభిప్రాయాలను తప్పు పట్టడం సబబు కాదు. నవతరం ముందుగా మన పురాణాల్లో దాగివున్న నీతిని అర్థం చేసుకోవాలి. తరువాతే ఏది సబబో యోచించాలి. దీపావళికి రాబోయే 'రామాయణ'ను నవతరం ప్రేక్షకులు ఏ తీరున ఆదరిస్తారో చూడాలి.

Updated Date - Apr 27 , 2026 | 04:21 PM