సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sanjay Dutt: దేశంలో 'శాంతి' లేదు.. ‘మున్నాభాయ్‌’ త‌ర‌హా స్పీచ్‌ అనుకుంటే రివ‌ర్స్ అయింది!

ABN, Publish Date - Oct 05 , 2026 | 11:07 AM

శేఖర్ సుమన్ షోలో దేశంలో మునుపటి ప్రశాంతత కనిపించడం లేదు అంటూ నటుడు సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి.

Sanjay Dutt

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ఇటీవల శేఖర్ సుమన్‌ నిర్వహించే శేఖర్ టునైట్ కార్యక్రమంలో గెస్ట్‌ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. గతంలోలాగా దేశంలో ప్రశాంతత ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాజాగా వివరణ ఇచ్చారు.

అది ‘స్క్రిప్టెడ్‌’ అని ఎవరినీ బాధ పెట్టడం, అవమానించడం తన ఉద్దేశం కాదన్నారు. ‘‘నా వ్యాఖ్యలు స్క్రిప్టెడ్‌ సంభాషణలో భాగం. వాటిని సరదాగా, హాస్యభరితంగా రూపొందించారు. ‘మున్నాభాయ్‌’ సినిమాలో మాట్లాడినట్లు స్పీచ్‌ ఇద్దాం అనుకున్నాను. ప్రేమ, ఆప్యాయత, ఐక్యత, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందించడమే దాని ఉద్దేశం. అయితే, దురదృష్టవశాత్తు నా మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని సంజయ్‌ దత్‌ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన ఒక కార్యక్రమంలో దేశంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై సంజయ్‌ మాట్లాడారు. ‘‘మన దేశ ప్రజలు ఎంతో మంచి వారు. ఇక్కడ శాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలో ఆ శాంతి నాకు కనిపించడం లేదు. భారతీయులది గొప్ప మనసు. ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటాం. మనం ఎంతో ఇచ్చాం. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఆ రోజులు మళ్లీ రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

ఇక తనకు ఐదు నిమిషాల పాటు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తాననే ప్రశ్నకు తన ఫేమస్‌ ‘మున్నాభాయ్‌’ పాత్ర తరహాలో సరదాగా సమాధానమిచ్చారు. గాంధీజీ, ఆయన మూడు కోతుల సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ.. తప్పును చూస్తే దాన్ని సరిదిద్దే మరో ‘నాలుగో కోతి’ కూడా కావాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated Date - Oct 05 , 2026 | 11:45 AM