Aamir Khan: ఆడంబరాల్లేని ఆమిర్‌ఖాన్ పెళ్లి
ABN, Publish Date - Jul 05 , 2026 | 10:30 AM
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ జీవితంలో కొత్త వెలుగులు నింపుతూ ఆదివారం ఆయనతో జీవితాన్ని పంచుకోబోతున్నారు బెంగళూరు బ్యూటీ గౌరీ స్ప్రాట్.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ (Aamir Khan) జీవితంలో కొత్త వెలుగులు నింపుతూ ఆదివారం ఆయనతో జీవితాన్ని పంచుకోబోతున్నారు బెంగళూరు బ్యూటీ గౌరీ స్ప్రాట్ (Gauri Spratt). ఒక స్టార్‌కు కాబోయే భార్యగానే కాకుండా.. విభిన్న సంస్కృతుల నేపథ్యం, స్వయంకృషితో ఎదిగిన వ్యాపారవేత్తగా, ప్రైవసీని ప్రేమించే మినిమలిస్ట్‌గా ఆమె ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. పాతికేళ్లనాటి స్నేహబంధాన్ని వైవాహిక జీవితంగా మార్చుకుంటున్న ఈ ‘వండర్ విమన్’ గురించి తెలుసుకుందాం.
గౌరీ స్ప్రాట్ (47) ఒక సాధారణ వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. తమిళ-బ్రిటిష్ మూలాలున్న తండ్రి రాబర్ట్ స్ప్రాట్ .. పంజాబీ-ఐరిష్ నేపథ్యం ఉన్న తల్లి రీటా స్ప్రాట్ ల కుమార్తె ఆమె. మరీ ముఖ్యంగా భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కమ్యూనిస్ట్ మేధావి ఫిలిప్ స్ప్రాట్ మనవరాలే ఈ గౌరీ స్ప్రాట్. ఊటీలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత ‘యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్’ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటోగ్రఫీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
ప్రేమగా మారిన పాతికేళ్ల స్నేహం
ఆమిర్‌ఖాన్ కజిన్ నుజహత్‌ఖాన్ ద్వారా 25 ఏళ్ల క్రితమే గౌరికి ఆమిర్‌తో పరిచయం ఏర్పడింది. సుదీర్ఘకాలం మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ గతేడాది మార్చిలో ఆమిర్ 60వ పుట్టిన రోజు సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌ను ప్రపంచానికి ప్రకటించారు. ఏడాది కాలంగా బాంద్రాలోని అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్న ఈ జంట.. చివరికి వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకుంది.
మాటల్లో ఆమిర్.. చేతల్లో గౌరి
తమ రిలేషన్ గురించి ఆమిర్ గతంలో మాట్లాడిన మాటలు వీరి బంధం ఎంత గాఢమైనదో చెబుతాయి. ‘నా మనసులో ఆమెతో నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది. గౌరి నా జీవితంలోకి రావడం నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇన్నాళ్లకు నేను పరిపూర్ణుడినయ్యానని అనిపిస్తోంది’ అంటూ ఆమిర్ తన ప్రేమను బహిరంగంగానే చాటుకున్నాడు. మరోవైపు గౌరి స్వభావరీత్యా లైమ్‌లైట్‌కు, ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం. ఆమె మౌనం, చేతలే ఆ బంధంపై ఆమెకున్న నమ్మకాన్ని చెబుతాయి. ఆమిర్ ఒంటరితనంలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతను ఇవ్వడం దగ్గరినుంచి.. ఆయన మునుపటి పిల్లలతో ఎంతో ప్రేమగా కలిసిపోవడం వరకు.. ఆమె ప్రతి అడుగులోనూ ఆమిర్ పట్ల ఉన్న గౌరవం, ఆత్మీయత కనిపిస్తాయి. మాటల కంటే చేతలకే ఆమె ప్రాధాన్యం ఇస్తారు.
ఆడంబరాల్లేని పెళ్లి
బాహ్య ప్రపంచానికి ఆడంబరంగా కనిపించే బాలీవుడ్ సంస్కృతికి భిన్నంగా గౌరి చాలా సాదాసీదా జీవనాన్ని ఇష్టపడతారు. అందుకే ఈ ఆదివారం ఆమిర్‌ఖాన్ బాంద్రా నివాసంలో 150 మంది సన్నిహితుల మధ్య ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‘ కింద ఎలాంటి హడావుడి లేని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. గౌరికి తన గత వివాహం ద్వారా ఉన్న ఏడేళ్ల కుమారుడు క్విన్, ఆమిర్‌ఖాన్ మునుపటి పిల్లలు జునైద్, ఇరా, ఆజాద్‌లు కూడా ఒక పర్ఫెక్ట్ ‘బ్లెండెడ్ ఫ్యామిలీ’గా కలిసిపోయారు.