Manushi Chhillar: నీట్ పేపర్ లీక్‌తో మరోసారి పరీక్ష రాశా.. మానుషి చిల్లర్
ABN, Publish Date - Aug 02 , 2026 | 10:20 AM
నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. తాను కూడా గతంలో నీట్ పేపర్ లీక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ ఘటన తన జీవితంలో మరచిపోలేని అనుభవంగా నిలిచిందని చెప్పారు.ఆమె దీని గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'వైద్య విద్యలో ప్రవేశం కోసం ఎంతో శ్రమించి నీట్ పరీక్షకు సిద్దమయ్యాను. అయితే పరీక్ష అనంతరం ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే నెలల తరబడి కష్టపడి చదివిన తర్వాత మళ్లీ కొద్ది రోజుల వ్యవధిలో తిరిగి సిద్ధం కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడి కలిగింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అండగా నిలవడంతో ఆ పరిస్థితిని అధిగమించి మళ్లీ పరీక్ష రాసి మంచి ఫలితం సాధించాను. అయితే అందరికీ ఇలా కుటుంబ సహకారం లభించదు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదివే విద్యార్థులు ఇలాంటి ఘటనల వల్ల ఎక్కువ ఇబ్బందులు పడతారు' అని అన్నారు. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ వైద్యుల కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే.
మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన మానుషి చిల్లర్.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 2022లో అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో బాలీవుడ్‌లో కథానాయికగా పరిచయమైన ఆమె, తదుపరి విక్కీ కౌశల్‌తో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' చిత్రంలో నటించారు. 2024లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్'లోనూ కీలక పాత్ర పోషించారు.