బికినీ కామెంట్స్.. కంగనా ఖంగుతినే రిప్లై ఇచ్చిన కృతి
ABN, Publish Date - Aug 25 , 2026 | 08:31 PM
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఏదైనా నచ్చలేదు అంటే.. మొహమాటం లేకుండా ఎండకట్టేస్తుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఏదైనా నచ్చలేదు అంటే.. మొహమాటం లేకుండా ఎండకట్టేస్తుంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా పట్టించుకోదు. వివాదాలు ఆమెకేమి కొత్తకాదు. మొన్నటికి మొన్న జెన్ జీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించిన ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రక్షాబంధన్ యాడ్ పై దుమ్మెత్తిపోసింది. ఈ యాడ్‌లో కృతి సనన్ వేసుకున్న మోడ్రన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ పండుగ సాంప్రదాయానికి తగినట్లుగా లేదంటూ కంగనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బికినీలో రాఖీ కట్టడేమంటని ప్రశ్నించింది. అంతేకాకుండా ఈ యాడ్‌లో పెంపుడు కుక్కకు రాఖీ కట్టడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు.
ఇక ఈ వివాదం, ట్రోలింగ్‌పై కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం సమాజం ఎప్పుడు ఆపుతుంది? అంటూ కంగనా ఖంగుతినేలా సమాధానం ఇచ్చింది. 'మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం సమాజం ఎప్పుడు ఆపుతుంది.. కాలంతో పాటు ఎథ్నిక్ ఫ్యాషన్ ఎంతగానో మారింది. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతికి ఇచ్చే గౌరవాన్ని ఆమె వేసుకునే బట్టలను బట్టి కొలవడం విచారకరం. సంస్కృతి, సాంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి.. వేసుకునే డ్రెస్ నెక్‌లైన్‌లో కాదు' అంటూ చెప్పుకొచ్చింది.
ఇక కుక్కకు రాఖీ కట్టడంపై కూడా కృతి స్పందించింది. 'పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం లేదా సారాంశం మనం వేసుకునే దుస్తుల్లో ఉండదు. ఆ సాంప్రదాయం వెనుక ఉన్న భావోద్వేగాలలో ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ప్రతి సంవత్సరం ఒకరికొకరు రాఖీ కట్టుకుంటాం.. ఒకరికొకరు తోడుగా, రక్షణగా ఉంటాం. మాకు ఈ ప్రార్థన, వాగ్దానం మా పెంపుడు కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవి కూడా మా కుటుంబంలో భాగమే" అని కృతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.