ఇదేం పాటరా.. అలా ఎలా రాశార్రా! ఇంతవల్గర్ లిరిక్సా! బ్యాన్ చేయాలని నెటిజన్ల ఆగ్రహం
ABN, Publish Date - Mar 17 , 2026 | 03:29 PM
కన్నడ చిత్రం 'కె.డి. ది డెవిల్' వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఐటమ్ సాంగ్ లోని సాహిత్యంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా హిందీ లిరికల్ వీడియోను యూ ట్యూబ్ నుండి తొలగించారు.
ధృవ సర్జా (Dhruva Sarja) హీరోగా ప్రేమ్ (Prem) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'కె.డి.: ద డెవిల్' (K.D. The Devil). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అదేంటో గానీ ఈ సంస్థకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. ఈ బ్యానర్ పై రూపుదిద్దుకున్న 'జన నాయగన్' (Jana Nayagan) రెండు నెలలుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఇదే సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'టాక్సిక్' (Toxic) మూవీ విడుదల వాయిదా పడింది. ఇక కన్నడలో నిర్మితమైన మరో సినిమా 'కె.డి. ది డెవిల్' ఇప్పుడు వివాదాలలో చిక్కుకుంది.
ఇటీవల ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్‌ను వివిధ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. రకీబ్ ఆలం హిందీ పాటకు సాహిత్యం అందించగా సత్యవతి రాథోడ్ ఆలపించింది. ఈ పాటలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌తో పాటు నోరా ఫతేహీ నర్తించింది. అయితే పాట చిత్రీకరణ వల్గర్‌గా ఉండటమే కాకుండా హిందీ సాహిత్యం అభ్యంతరకరంగా ఉంది. పాటలో మాత్రం చాలా దారుణమైన పదాలను రచయిత ఉపయోగించారు. దాంతో ఇది పరమ బూతు పాటగా మారిపోయింది.
దాంతో నెటిజన్స్ ఈ మూవీ మేకర్స్ మీద, పాట చిత్రీకరణకు బాధ్యులైన వారి మీద విమర్శల దాడి చేశారు. అసలు ఇండియన్ సినిమా ఎటు పోతుందిరా.. ఇదేం పాటరా.. అలా ఎలా రాశార్రా! ఇంత.. వల్గర్ లిరిక్సా మా జీవితంలో వినలేదు అంటూ నెటిజన్లు ప్రత్యేకంగా పాట ఆ లిరిక్స్ పెట్టి మరి తీవ్రంగా పరుష పదజాలంతో దుమ్మెత్తి పోస్తున్నారు. పాటను తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా.. ఇబ్బడి ముబ్బడిగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఆడియో కంపెనీ హిందీ పాటను యూట్యూబ్ నుండి తొలగించింది.
పాటపై మీ అభిప్రాయాన్ని తెలియచేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదిలాఉంటే.. తెలుగులో జరిపెయ్ నాతో పండగ జరిపెయ్ అంటూ సాగిన ఈ పాటను చంద్రబోస్ రాయగా మంగ్లీ ఆలపించింది. ఆయన ఈ పాటను జాగ్రత్తగా వినేవారికి ఎలాంటి సెకండ్ థాట్ కలగకుండా చూసుకున్నారు. ఆ పాట లిరికల్ వీడియోను చూస్తున్నవారు, రేపు సినిమాలో ఈ పాటను చూసేవారు వేరే రకంగా దీన్ని అర్థం చేసుకునే ఆస్కారం లేదు. అంతేకాదు.. ఇందులో ఉపయోగించిన పదాలను వేరేగా అన్వయించుకోవడానికి అవకాశం కూడా లేదు.
ఇకపోతే.. సహజంగానే డాన్స్ నంబర్స్ అంటే ఎంతో కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. అయితే అది హద్దులు మీరనంత వరకూ ఫర్వాలేదు. సినిమాకు ఒకవేళ 'ఎ' సర్టిఫికెట్ వస్తే గొడవే లేదు. కానీ యూ ట్యూబ్‌లో ఆ పాటను పోస్ట్ చేసే ముందు అందులో ఉపయోగించిన భాషను, విజువల్స్‌ను కూడా గమనించాల్సి ఉండాల్సింది. యూ ట్యూబ్ వీడియోలకు సెన్సార్ అనేది లేకపోయినా.. మరీ దిగజారిన లిరిక్స్, విజువల్స్ ఉంటే ఖచ్చితంగా సభ్య సమాజం నుండి అభ్యంతరాలు ఎదురవుతాయి. ఇప్పుడదే జరిగింది. దాంతో మేకర్స్ తలవొంచక తప్పదు. ఇప్పుడు 'కె.డి. ది డెవిల్' విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తోంది. మరి లిరిక్స్ ను మార్చి, తిరిగి పాడించి యూ ట్యూబ్‌లో మరోసారి పోస్ట్ చేస్తారేమో చూడాలి.