నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అదిరిపోయిన దాయ్రా ట్రైలర్
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:05 PM
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన వైవిధ్యమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దాయ్రా(Daayra).
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran ) ప్రధాన పాత్రల్లో నటించిన వైవిధ్యమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దాయ్రా(Daayra). జాతీయ అవార్డు గ్రహీత మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ మరియు డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా దాయ్రా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ కథ, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఒక నేరం చుట్టూ తిరుగుతుంది. ఆ కేసు నిజాలను వెలికితీసే క్రమంలో సీనియర్ పోలీస్ అధికారులుగా కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎదురెదురు పడతారు. ఒకే నేరంపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, విధి నిర్వహణ, న్యాయం విషయంలో వీరిద్దరి ఆలోచనా విధానాలు, ఎంచుకునే దారులు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, భావోద్వేగపూరిత సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి.
యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలసి అందించిన ఈ కథలో జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్‌జీత్ సింగ్, సందీప్ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం నేరాన్ని మాత్రమే కాకుండా, ఒక ఘటనపై సమాజంలో ఏర్పడే అభిప్రాయాలు, మీడియా కథనాలు, అసలైన న్యాయం స్వరూపంపై పదునైన ప్రశ్నలు సంధిస్తూ దాయ్రా చిత్రం ఒక ఆలోచనాత్మక థ్రిల్లర్‌గా అలరించబోతోందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ సినిమాతో కరీనా కపూర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.