నీరా ఆర్య బయోపిక్‌లో కంగనా రనౌత్
ABN, Publish Date - Mar 14 , 2026 | 02:15 PM
జాతీయ ఉత్తమ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ఓ అరుదైన పాత్రను చేయబోతున్నారు. సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో పనిచేసిన భారతీయ మొదటి గూఢాచారిణి నీరా ఆర్య పాత్రను కంగనా పోషించబోతున్నట్టు తెలుస్తోంది.
వెండితెరపై ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ వెనుకాడరు. అయితే... ఇప్పుడు లోక్‌సభ సభ్యురాలు కూడా అయిన కంగనా రనౌత్ పాత్రల ఎంపిక విషయంలో మరింత ఆచితూచి సాగుతున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన ఆజాద్ హింద్ ఫౌజ్ (Azad Hind Fauj) లో పనిచేసిన నీరా ఆర్య (Neera Arya) బయోపిక్‌లో కంగనా రనౌత్ నటించబోతున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లోచక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు శివమ్ నాయర్ (Shivam Nair) దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు.
సుభాష్ చంద్రబోస్‌కు చెందిన రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు చెందిన సైనికురాలు నీరా ఆర్య. ఆమెకు ఈ దేశ తొలి గూఢచారిణి అనే పేరుంది. బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక అధికారితో ఆమె వివాహం జరిగిందని, సిద్ధాంతపరమైన విభేధాల కారణంగా వారి జీవితంలో సంఘర్షణ చోటు చేసుకుందని చారిత్రకారులు చెబుతుంటారు. బ్రిటీష్ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసినట్టుగానూ చరిత్రలో ఉంది. స్వాతంత్ర్యానంతరం ఆమె ప్రజల దృష్టిలో పడకుండా జీవితాన్ని గడిపి, 1998లో తనువు చాలించారని చెబుతుంటారు. గత కొంతకాలంగా ఆమె త్యాగానికి తగిన గుర్తింపు లభిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె బయోపిక్ సైతం రాబోతోందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా అధికారికంగా రావాల్సి ఉంది.