Kangana Ranaut: రూమర్లకు చెక్.. కంగనా దీటైన సమాధానం
ABN, Publish Date - Apr 19 , 2026 | 11:10 AM
బాలీవుడ్ వెండితెరపై ‘క్వీన్’గా వెలిగి, ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కంగన రనౌత్ (Kangana Ranaut)ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు.
బాలీవుడ్ వెండితెరపై ‘క్వీన్’గా వెలిగి, ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కంగన రనౌత్ (Kangana Ranaut)ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. ఆమె నోరు విప్పితే అది సంచలనం... చర్చనీయాంశం. ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వెల్లువెత్తుతున్న పుకార్లకు ఆమె తెరదించారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కంగన రనౌత్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మధ్య వ్యక్తిగత సంబంధంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో జంటగా నటించడం, ఇప్పుడు ఇద్దరూ పార్లమెంటు సభ్యులుగా ఉండటంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ రూమర్లపై కంగన నిక్కచ్చిగా స్పందించారు. ‘‘చిరాగ్ నాకు అత్యంత ఆప్తమిత్రుడు. ఒకవేళ మా మధ్య ఏమైనా ఉండి ఉంటే ఈపాటికే మాకు పిల్లలు కూడా ఉండేవారు’’ అంటూ రూమర్లు సృష్టించే వారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు.
దీపికకు అండ...
బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొణె సినిమా సెట్స్‌లో 8 గంటల పనివేళల గురించి చేసిన డిమాండ్ పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో ప్రభాస్‌తో చేస్తున్న సినిమాలు ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడం వెనుక ఈ పనివేళల నిబంధన ఉందనే వార్తలు వచ్చాయి. ఒక బిడ్డకు తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే, వృత్తిపరంగా రాజీపడకూడదనే దీపిక నిర్ణయాన్ని కంగన మనస్ఫూర్తిగా సమర్థించారు. ‘దీపిక ఈ రోజు ఉన్న స్థానం సామాన్యమైనది కాదు, ఆమె ఈ స్థాయిని తన కష్టంతో సంపాదించుకుంది. అటువంటి వ్యక్తి 8 గంటలే పనిచేస్తానంటే అందులో తప్పేముంది?’ అని కంగన ప్రశ్నించారు.
పాత జ్ఞాపకాలు.. అప్పటి కసి
కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను కంగన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘నేను, దీపిక కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు 12 నుంచి 14 గంటలపాటు నిర్విరామంగా పనిచేసేవాళ్లం. అప్పుడు మాకు ఒక రకమైన కసి ఉండేది. ఇండస్ట్రీలో మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకలి ఉండేది. అప్పుడు మాకు అలసిపోయే తీరిక కూడా లేదు’’ అని కంగన గుర్తుచేసుకున్నారు. కానీ, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కూడా అదే రకమైన వెట్టిచాకిరి చేయించుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒక మహిళ తల్లిగా మారినప్పుడు ఆమె ప్రాధాన్యతలు మారుతాయని, ఆ మార్పును ఇండస్ట్రీ గౌరవించాలని ఆమె కోరారు. కెరీర్ ఎదుగుదల కోసం వ్యక్తిగత జీవితాన్ని బలిపెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇండస్ట్రీలో పురుష పక్షపాతం
సినిమా రంగంలో వేళ్లూనుకున్న వివక్షను కంగన చాలా లోతుగా విశ్లేషించారు. ఇక్కడ పురుష సూపర్‌స్టార్లు చాలామంది ఏళ్ల తరబడి 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ‘‘ఎంతోమంది స్టార్ హీరోలు సోమవారం నుంచి శుక్రవారం వరకే షూటింగ్ చేస్తారు. వారు 8 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించరు. కానీ, వారిని ఎవరూ ప్రశ్నించరు. అదే ఒక మహిళ తన హక్కుల గురించి మాట్లాడితే మాత్రం ఆమెను అహంకారిగా చిత్రీకరిస్తారు’’ అని కంగన ఆవేదన వ్యక్తంచేశారు. పని ఒత్తిడి వల్ల మహిళల ఆరోగ్యం పాడవుతోందని, కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని చెప్పారు.
వ్యవస్థలో మార్పు రావాల్సిందే
సినిమా మేకింగ్ పద్ధతుల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని కంగన నొక్కి చెప్పారు. ప్రతిభ ఉన్న నటుల చుట్టూ కథలు తిరగాలే తప్ప, వారిని యంత్రాల్లా వాడకూడదని చెప్పారు. దీపిక పదుకొణె వంటివారు గళం విప్పడం వల్ల భవిష్యత్తులో వచ్చే నటీమణులకు ఒక సౌకర్యవంతమైన పని వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. షారూఖ్ ఖాన్‌తో ‘కింగ్’, అల్లు అర్జున్‌తో ‘రాకా’ వంటి చిత్రాల్లో నటించబోతున్న దీపికకు కంగన మద్దతు తెలపడం బాలీవుడ్‌లో ఒక కొత్త ఐక్యతకు సంకేతంగా కనిపిస్తోంది.
క్వీన్’కు సీక్వెల్
కంగన చివరిసారి ‘ఎమర్జెన్సీ’ సినిమాలో కనిపించారు. ప్రేక్షకులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘భారత భాగ్య విధాత’ సినిమా సెట్స్‌పై ఉంది. ఇది ముంబై దాడుల నేపథ్యంలో కామా ఆసుపత్రిలో బాధితులకు సేవలు అందించిన ఒక నర్స్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, దాదాపు 12 ఏళ్ల తర్వాత ‘క్వీన్’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. క్వీన్ చిత్రానికి గాను కంగన జాతీయ అవార్డు అందుకున్నారు.
‘చుడైల్’ ముద్ర వెనుక అసలు నిజం
తమ అభిప్రాయాలను బలంగా చెప్పే మహిళలను ఈ సమాజం ఎలా చూస్తుందో చెబుతూ గతాన్ని మరోమారు ప్రస్తావించారు కంగన. ‘‘నన్ను గతంలో ‘చుడైల్’ (మంత్రగత్తె) అని పిలిచారు. నేను రక్తం తాగుతానంటూ ప్రచారం చేశారు. ఒక ఒంటరి మహిళ ఒంటరిగా పోరాడుతుంటే అణచివేయడానికి ఇలాంటి నీచమైన మార్గాలను ఎంచుకుంటారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు దీపిక ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా దాదాపు అలాంటిదేనని, ఆమె గొంతును నొక్కేందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.