రామ్ చరణ్ జాక్‌పాట్.. 'ధురంధర్' మేకర్స్ చేతుల్లోకి 'పెద్ది'
ABN, Publish Date - Mar 28 , 2026 | 01:29 PM
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పెద్ది చిత్ర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పెద్ది (Peddi) చిత్ర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో చరణ్ 'పహిల్వాన్'గా కనిపిస్తూ తన రగ్డ్ లుక్, మాస్ మేకోవర్‌తో అభిమానులకు అసలైన కిక్ ఇచ్చారు. ఈ సాలిడ్ గ్లింప్స్‌తో సినిమా హైప్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరింది. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ జర్నీ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు కూడా చెప్పబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా హిందీ వెర్షన్‌కు సంబంధించి ఉత్తరాది మార్కెట్‌లో భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తిరుగులేని పట్టున్న ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ (Jio Studios) వారు ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకున్నారట. ధురంధర్ (Dhurandhar) చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జియో స్టూడియోస్ వంటి అగ్ర సంస్థ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడం 'పెద్ది' టీమ్‌కు పెద్ద ఊరటనిచ్చే విషయం. రామ్ చరణ్‌కు ఉత్తరాదిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడంతో, ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా ‘పుష్ప’, ‘RRR’ తరహాలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
జియో స్టూడియోస్ రంగంలోకి దిగడంతో ఉత్తరాదిలో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దొరకడమే కాకుండా ప్రమోషన్లు కూడా అదే రేంజ్‌లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే, హిందీ ఆడియన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A R Rahman) సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ వంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల విషయంలో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, ఏప్రిల్ 30, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి పక్కాగా వస్తుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.