ఒకే ఇతివృత్తంతో రెండు చిత్రాలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:04 PM
ఇళయరాజా - ఎ.ఆర్. రహమాన్ మధ్య ఆసక్తికరపోటీ నెలకొంది. ఇళయరాజా 'వాల్మీకి రామాయణ' చిత్రానికి సంగీతం అందిస్తుంటే... రహమాన్ 'రామాయణ' చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.
ఆ గురుశిష్యులు ఇద్దరూ తమ సంగీతంతో జనాన్ని మంత్రముగ్ధులను చేశారు. పలుమార్లు బాక్సాఫీస్ వార్ లోనూ నువ్వా నేనా అంటూ సాగారు. ఇప్పుడు మరోసారి వారిద్దరి మధ్య పోటీ అనివార్యమయింది. అంతేకాదు వారిద్దరూ బాణీలు కడుతున్న చిత్రాలు ఒకే ఇతివృత్తంతో తెరకెక్కడం విశేషం.
ఇళయరాజా (Ilaiyaraaja) - ఎ.ఆర్. రహమాన్ (A.R. Rahman) గురుశిష్యులని అందరికీ తెలుసు. ఎందుకంటే 1980లలో ఇళయరాజా వద్ద రహమాన్ కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు. తరువాత 'రోజా' (Roja) తో సంగీత దర్శకుడయ్యాక గురువు ఇళయరాజాతోనే పోటీపడుతూ సాగారు రహమాన్. ఇప్పుడు మరోమారు వారిద్దరి కంపోజింగ్ తో రూపొందుతున్న రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొనబోతోందని టాక్. పైగా ఆ రెండు సినిమాల ఇతివృత్తం ఒకటే కావడం ఇక్కడ విశేషం. 'వాల్మీకి రామాయణం' (Valmiki Ramayana) అనే టైటిల్ తో భావనా తల్వార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఇక 'రామాయణ' (Ramayana) భారీ పౌరాణిక చిత్రం నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలోని పాటలకు ఎ.ఆర్. రహమాన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాత్రం హాన్స్ జిమ్మర్ సమకూరుస్తూ ఉండడం విశేషం. ఈ మూవీ నవంబర్ 8న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య నేరుగా బాక్సాఫీస్ వార్ లేకున్నా, ఒకే కథాంశం కావడంతో గురుశిష్యుల పోటీగా భావిస్తున్నారు సినీజనం. ఈ యేడాది శ్రీరామనవమికి 'వాల్మీకి రామాయణ' పోస్టర్ రిలీజయింది. కాగా, శ్రీహనుమాన్ జయంతి సందర్భంగా 'రామాయణ' టీజర్ విడుదల కావడం విశేషం!
వాల్మీకి రామాయణం అన్ని రామాయణాలకూ మూలం అని అందరికీ తెలుసు. అయితే తరువాత రామాయణగాథను పలువురు తమదైన కల్పనతో రచించి రక్తి కట్టించారు. అలా 'ఉత్తర రామాయణం' వెలసింది. ఈ గాథలోనే లవకుశుల కథ ఉంటుంది. వాస్తవానికి ఇది వాల్మీకి రామాయణంలో లేదని అంటారు. సినిమాల్లోనూ పలుగాథలతో రామాయణం వెలసింది. కొందరు వాల్మీకి విరచిత రామాయణగాథనే అనుసరించారు. మరికొందరు కొత్త ఊహలతో సినిమాటిక్ ఫ్రీడమ్ తో సాగారు. ఎందరు ఎలా సాగినా, 'రామాయణ' గాథ సినిమా రూపంలోనూ పలుమార్లు అలరించింది. ప్రస్తుతం హిందీ దర్శకురాలు భావనా తల్వార్ దర్శకత్వంలో 'వాల్మీకి రామాయణ' రూపొందుతోంది. ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్ మిలియనీర్'తో బెస్ట్ సౌండ్ డిజైనింగ్ కు ఆస్కార్ అందుకున్న రసూల్ పూకట్టి పనిచేస్తున్నారు. అలాగే ఇళయరాజా ఈ సినిమా పాటలకు బాణీలు కడుతూ ఉండడం విశేషం. గతంలో 'శ్రీరామరాజ్యం' (Srirama Rajyam) చిత్రానికి ఇళయరాజా తనదైన స్వరకల్పనతో అలరించిన తీరు అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు ఇళయరాజా వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన ఎ.ఆర్.రహమాన్ బాణీలతో 'రామాయణ' చిత్రం రూపొందుతోంది. అదే ఎ.ఆర్.రహమాన్ తో కలసి 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డు అందుకున్న రసూల్ పూకట్టి ఇప్పుడు 'వాల్మీకి రామాయణం'కు సౌండ్ డిజైనర్ కావడం గమనార్హం. ఇలా ఒకప్పుడు కలసి పనిచేసినవారే ఇప్పుడు ఒకే ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న రెండు రామాయణ కథాచిత్రాలకు పనిచేస్తూ ఉండడం మరింత విశేషంగా మారింది. మరి ఈ రెండు సినిమాల్లో ముందుగా ఇళయరాజా బాణీల్లో రూపొందిన 'వాల్మీకి రామాయణ' అక్టోబర్ 2న గాంధీ జయంతికి రానుంది. ఇక దీపావళి కానుకగా నవంబర్ 8న 'రామాయణ' వెలుగు చూడనుంది. ఈ రెండు సినిమాల్లోని పాటలు సంగీతాభిమానులను ఏ తీరున మురిపిస్తాయో చూడాలి.