Sanjay Dutt: 'మరాఠీ తప్పనిసరి' వివాదం నేపథ్యంలో సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్
ABN, Publish Date - Sep 09 , 2026 | 09:08 AM
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) మరాఠీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) మరాఠీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరాఠీ (Marathi)లో మాట్లాడాలని కొందరు అడగ్గా.. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా మరాఠీ నేర్చుకోలేదని చెప్పారు. సంజయ్ దత్ మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్‌తో కలిసి ఆదివారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ మరాఠీలో మాట్లాడాలని కొందరు కోరారు. దీనికి ఆయన నవ్వుతూ.. తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. "ప్రతాప్ భాయ్.. నేను పుణెలోని ఎరవాడ జైలులో ఏకంగా ఆరేళ్లు ఉన్నాను. అయినా సరే మరాఠీ నేర్చుకోలేకపోయాను" అంటూ సరదాగా తప్పించుకున్నారు.
సర్ నాయక్ మహారాష్ట్రలోని ట్యాక్సీ డ్రైవర్లు ఆగస్టు 15లోగా మరాఠీ నేర్చుకోవాలని ఇటీవల గడువు విధించడం గమనార్హం. ఆయన ముందే సంజయ్ దత్ మరాఠీ రాదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్ దత్ వ్యాఖ్యలపై ఎరవాడ జైలు మాజీ సూపరింటెండెంట్ డీఐజీ స్వాతి సాఠే స్పందించారు. సంజయ్. దత్ జైల్లో మరాఠీ నేర్చుకోకపోయినా.. 'భయం' భాషను మాత్రం బాగా నేర్చుకున్నారన్నారు. మొదటిసారి జైలుకు వచ్చినప్పుడు ఖైదీ దుస్తులు ధరించేందుకు సంజయ్ నిరాకరించారని, గట్టిగా వార్నింగ్ ఇచ్చాక వేసుకున్నారని ఆమె వెల్లడించారు.