‘ఇప్పుడేం సమాధానం చెబుతారు? నటుడు గోవిందపై.. భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!
ABN, Publish Date - Aug 12 , 2026 | 08:46 AM
గోవిందకు కొందరు నటీమణులతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై భార్య సునీత స్పందించారు.
బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొందరు నటీమణులతో గోవిందకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై గోవింద భార్య సునీత (Sunita) చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. గోవిందకు గతంలో కోమల్‌రాణి (Komal Rani)అనే నటితో సంబంధం ఉందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించినట్లు చెబుతున్న కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవింద వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది.
గతంలోనే గోవిందకు కొందరు నటీమణులతో సంబంధాలు ఉన్నాయని తాను చెప్పినప్పుడు చాలామంది తనను ట్రోల్ చేశారని సునీత పేర్కొన్నారు. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న పరిణామాలపై తనను విమర్శించిన వారు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘కొందరు నటీమణులతో గోవిందకు సంబంధం ఉందని నేను చెప్పినప్పుడు చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు వారేం సమాధానం చెబుతారు?’ ప్రస్తుతం గోవింద మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే కోమల్‌రాణితో తన భర్తకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై నేరుగా స్పందించడానికి సునీత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు విజువల్స్ గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇక తన భార్య తనపై చేసే వ్యాఖ్యలు, ఆమె వ్యవహరించే తీరు వెనుక తనపై ఉన్న ప్రేమే కారణమని గోవింద పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దంపతుల మధ్య సంబంధంపై మరోసారి బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.