కాక్రోచ్ జెన్ జీ వార్.. బాలీవుడ్‌కు కొత్త టెన్షన్!
ABN, Publish Date - Aug 04 , 2026 | 09:04 PM
తమకు నచ్చిన సినిమా టిక్కెట్ ధర ఎంతైనా సరే వెనుకాడకుండా కొనేసే తెగింపు నవతరం ప్రేక్షకులకే ఉంది.. అందుకే 'జెన్ జీ'ని ఎట్రాక్ట్ చేయాలన్నదే మూవీ మేకర్స్ టార్గెట్ గా మారింది. కానీ కాక్రోచ్ పార్టీపై కంగనా కామెంట్స్ - ఇతర స్టార్స్ ఉదాసీనత బాలీవుడ్ సినిమాకు పెద్ద దెబ్బ పడేలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకలాగా?
ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలను మొదట్లో కేంద్రం అంతగా పట్టించుకోలేదు. చివరకు కాక్రోచెస్ కు మద్దతుగా దేశంలోని యువత కదం తొక్కింది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ దిగివచ్చింది - నీట్ పేపర్ లీకేజ్ కేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ ఉద్యమ సమయంలో యువత విప్లవించింది. అయితే మన స్టార్స్ లో ఏ ఒక్కరూ 'సీజీపీ' నిరసనకు మద్దతు ప్రకటించలేదు. ఒకే ఒక్క సల్మాన్ ఖాన్ (Salman Khan) మొదటి నుంచీ యువతకు అండగా కామెంట్స్ చేశారు. దేశంలోని మిగిలిన ఏ స్టార్స్ కూడా యూత్ కు సపోర్ట్ చేయకపోవడంపై నవతరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు సపోర్ట్ చేస్తే ఎంత? చేయకుంటే ఎంత? అన్నట్టుగా జెన్ జీ (Gen Z) మాట్లాడుతోంది. వీరి యాటిట్యూడ్ ను అర్థం చేసుకున్న ఎందరో సినిమా తారలు మద్దతు పలికారు. కానీ, కోట్లాది రూపాయల పారితోషికాలు పుచ్చుకుంటూ టాప్ స్టార్స్ గా రాజ్యం ఏలుతున్నవారెవరూ సపోర్ట్ చేయలేదు. దానినే యూత్ తప్పు పడుతోంది.
అదీ సంగతి...!
సీజేపీ ఆధ్వర్యంలో సాగిన ధర్నాకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు పలికారు. అధికారంలో ఉన్న బీజేపీ- దాని మిత్రపక్షాల్లోని ఎంపీలు కూడా యువతను ఆదుకోవాలి అన్న వ్యాఖ్యలే చేశారు. మండి లోక్ సభ సభ్యురాలు, ప్రముఖ నటి కంగనా రనౌత్ మాత్రం యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాక్రోచెస్ ను 'జనరేషన్ గట్టర్' అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై యూత్ విరచుకు పడుతోంది. అయినా కంగనా తగ్గకుండా కౌంటర్స్ వేస్తూనే ఉండడంతో జెన్ జీ రాబోయే సినిమాలనే చూడకూడదు అన్న ఆలోచనకు వచ్చినట్టు పరిశీలకులు చెబుతున్నారు. కంగనా కామెంట్స్ పుండుపై కారం చల్లినట్టుగా ఉన్నాయని, ఆమె నటించే సినిమాలను ఎటూ ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు ఆదరించరనీ అంటున్నారు. అయితే కంగనా కామెంట్స్ కారణంగా బాలీవుడ్ (Bollywood) నుండి రాబోయే సినిమాలకు దెబ్బ పడే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో సల్మాన్ మినహా ఎవరూ సీజేపీ ధర్నాకు మద్దతు పలకలేదు. నిలచినవారందరూ ప్రస్తుతం స్టార్స్ హోదాలో లేరు. అదీ సంగతి అంటున్నారు పరిశీలకులు.
వయసు మళ్ళిన వాళ్ళే..
కాక్రోచ్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ పై కంగనా రనౌత్ కామెంట్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో జెన్ జీ కూడా తగ్గేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలను ఖండించిన ధైర్యశాలి సోనూ సూద్ అనే చెప్పాలి... యువతీయువకులు, నవతరంకు గౌరవం ఇచ్చి తీరాలని, వారిని విమర్శించడం సబబు కాదని సోనూ అభిప్రాయపడ్డారు. కానీ, నటి కొంకణా సేన్ భర్త, నటుడు రణ్వీర్ షోరే, మరో నటుడు పవన్ మల్హోత్రా వంటి వారు కంగనాకు మద్దతుగా నిలిచారు. ఈ ఇద్దరు నటుల్లో రణ్వీర్ 53 ఏళ్ళవాడు, పవన్ మల్హోత్రా 68 ఏళ్ళవాడు కావడం గమనార్హం! వీరిద్దరూ ధర్నా సమయంలో సీజేపీ ప్రతినిధులు, యువత వాడిన భాష సరికాదని తప్పు పడుతున్నారు.. దీంతో సినీజనంపై జెన్ జీ మరింత ఏవగింపు ప్రదర్శిస్తూ ఉండడం గమనార్హం!
వారే రాజపోషకులు..
'జనరేషన్ జెడ్' ను షార్ట్ కట్ లో 'జెన్ జీ' అంటున్నారు. 1997 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించిన వారిని 'జెన్ జీ' కేటగిరీలో చేరుస్తున్నారు. అంటే ఇప్పటికి వారి వయసు 14 ఏళ్ళ నుండి 29 ఏళ్ళ మధ్య ఉంటుంది. మన దేశ జనాభాలో వీరు దాదాపు 28 శాతం ఉన్నట్టు అంచనా. వీరిలోనూ 18 నుండి 20 ఏళ్ళ మధ్య ఉన్నవారే అత్యధిక సంఖ్యలో సినిమాలను వీక్షిస్తున్నారు. మొన్న జరిగిన 'సీజేపీ' ధర్నాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించిన వారిలోనూ వీరే అధికంగా ఉన్నారు. వీరందరూ తాము ఎంతగానో అభిమానించే సినిమా స్టార్స్ తమ నిజాయితీగల పోరాటానికి మద్దతు పలకక పోవడంపై గుర్రుగానే ఉన్నారు. సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతామనీ వారంటున్నారు. గతంలో లాగా తమ అభిమాన స్టార్స్ ఏది చేస్తే అదే బెస్ట్ అనే తరహాలో ఈ జెన్ జీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. అందువల్ల రాబోయే సినిమాలకు ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ కు జెన్ జీ కారణంగా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని అంటున్నారు.
వీరు కాకుంటే.. వారు లేరా?
ఆగస్టులో బాలీవుడ్ నుంచి "ప్రహార్, ఆర్యభట్ కా జీరో, ఆవారాపన్-2, బట్వారా 1947, ఈత, ఖోస్లా కా ఘోస్లా-2" వంటి చిత్రాలు రానున్నాయి. సెప్టెంబర్ లో "మిర్జాపూర్ ద ఫిలిమ్, దాయ్రా, వన్" సినిమాలు, అక్టోబర్ లో "దృశ్యం-3, జానమ్ తేరీ కసమ్, డోంగ్రీ- గ్యాంగ్ స్టర్స్ ప్యారడైజ్, రఫ్తార్, మ్యాజిక్ వాలెట్" లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందిన 'రామాయణ' సిరీస్ లో మొదటి భాగం నవంబర్ 8న వెలుగు చూడనుంది. అదే నెలలో "సెక్షన్ 84, యే ప్రేమ్ మోల్ లియా, మామ్ -2" చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ లో షారుఖ్ ఖాన్ 'కింగ్', శక్తి శాలిని, చాముండ" వంటి చిత్రాలు రానున్నాయి. ఈ అన్ని చిత్రాల్లోకి అత్యధిక వ్యయంతో రూపొందిన 'రామాయణ', షారుఖ్ ఖాన్ 'కింగ్'కు జెన్ జీ ఆడియెన్స్ చూడకపోయినా, నలభై ఏళ్ళు దాటిన సినిమా ఫ్యాన్స్ చూస్తారని పరిశీలకుల మాట. అయితే మొదటి రోజునే థియేటర్స్ ను ఫుల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న జెన్ జీ ఆడియెన్సెస్ మిస్ అయితే తప్పకుండా అది ఈ సినిమాల వసూళ్ళపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరి రాబోయే బాలీవుడ్ మూవీస్ వసూళ్ళకు జెన్ జీ ప్రేక్షకులు గండికొడతారో లేదో చూద్దాం.