Sara Arjun: ఇక్కడ.. నాకు ఆ కష్టాలు తప్పలేదు
ABN, Publish Date - Feb 01 , 2026 | 10:09 AM
ఆమె కళ్లు మాట్లాడతాయి. ఆమె చిరునవ్వు కోటి భావాలను పలికిస్తుంది. పుష్కర కాలం క్రితం విక్రమ్ ‘నాన్న’ సినిమాలో చిట్టి పాపగా మనందరి హృదయాలను కొల్లగొట్టిన ఆ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
ఆమె కళ్లు మాట్లాడతాయి. ఆమె చిరునవ్వు కోటి భావాలను పలికిస్తుంది. పుష్కర కాలం క్రితం విక్రమ్ ‘నాన్న’ సినిమాలో చిట్టి పాపగా మనందరి హృదయాలను కొల్లగొట్టిన ఆ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రణ్‌వీర్‌సింగ్ సరసన ‘ధురంధర్’లో (Dhurandhar) యలినాగా మెప్పించి.. ఇప్పుడు తెలుగులో ‘యూఫోరియా’(Euphoria)తో పలకరించబోతున్న సారా అర్జున్ (Sara Arjun) సినీ ప్రస్థానం ఇది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక యూఫోరిక్ (అత్యంత ఆనందకరమైన) క్షణం ఒకటి ఉంటుంది. నాకు మాత్రం ధురంధర్ సినిమా చూసి అమ్మానాన్నలు కన్నీరు పెట్టుకున్న రోజు అది. నేను చదువులో టాపర్‌గా వచ్చినప్పుడు కూడా వారు అంతలా ఎమోషనల్ కాలేదు. నావల్ల వారు గర్వంగా ఫీలవడం నా కెరీర్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్’’ అని చెప్పుకొచ్చింది సారా.
వారసత్వం ఉన్నా తప్పని ఆడిషన్..
సారా తండ్రి రాజ్ అర్జున్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నా, ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. రణ్‌వీర్‌సింగ్ వంటి స్టార్ సరసన నటించే అవకాశం కోసం ఆరు రౌండ్ల కఠినమైన ఆడిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛాబ్రా వద్ద తాను ఏ సినిమాకు ఆడిషన్ ఇస్తుందో కూడా తెలియకుండానే పెర్ఫార్మ్ చేసి ఈ పాత్రను దక్కించుకుంది. స్టార్ కిడ్ అయినప్పటికీ ప్రతిభను నిరూపించుకుంటేనే అవకాశాలు వస్తాయని సారా నమ్ముతుంది.
దిగ్గజాల నీడలో శిక్షణ..
ఐదేళ్ల వయసులోనే మణిరత్నం, విక్రమ్ వంటి దిగ్గజాలతో పని చేసిన అనుభవం సారాకు ఉంది. ‘నాకు విక్రమ్ ఇప్పటికీ ‘విక్రమ్ అప్పా’నే. మణిరత్నం సెట్‌లో క్రమశిక్షణ, ఐశ్వర్యరాయ్ ఆత్మీయత నన్ను నటిగా తీర్చిదిద్దాయి. పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ (నందిని) చిన్నప్పటి పాత్ర చేయడం నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ వయసులోనే ఎటువంటి భయం లేకుండా భావాలను పలికించడం వల్ల ఇప్పుడు కెమెరా ముందు నటిస్తున్నప్పుడు నాకు ఎటువంటి జంకు ఉండదు’ అని సారా తన చిన్నప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంది.
తెలుగులో మరిన్ని సాహసాలు..
సారా దృష్టి ప్రస్తుతం టాలీవుడ్ సెన్షేనల్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యూఫోరియా’పైనే ఉంది. ‘పొన్నియన్ సెల్వన్ తర్వాత విదేశాలకు వెళ్లి సినిమా కోర్సు చేయాలనుకున్నాను. కానీ, యూఫోరియా స్ర్కిప్ట్ నా ఆలోచనను మార్చేసింది. ఒక నటిగా నాలోని తపనను ఈ కథ గుర్తించింది. ఇది కేవలం గ్లామర్ సినిమా కాదు, ఒక బలమైన కథ’ అని సారా చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివాదాలపై స్పష్టత..
ధురంధర్ సినిమాలో తనకంటే పెద్దవాడైన రణ్‌వీర్‌సింగ్‌తో రొమాంటిక్ కెమిస్ట్రీపై జరుగుతున్న చర్చలపై సారా చాలా పరిణితితో సమాధానమిచ్చింది. ‘కథలో పాత్రల మధ్య వయసు అంతరం ఏంటనేది స్పష్టంగా ఉంది. అది ఆ స్టోరీ డిమాండ్. స్క్రిప్ట్ ప్రకారం ఆ బంధం జస్టిఫైడ్ అని నేను భావిస్తున్నాను. నటిగా పాత్ర ప్రాధాన్యతనే నేను చూస్తాను’ అని స్పష్టం చేసింది. ‘ధురంధర్ 2’లో తన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా కనిపిస్తానని సారా హింట్ ఇచ్చింది.
చదువు.. కెరీర్ బ్యాలెన్స్..
చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు. కానీ సారా విషయంలో అది పూర్తిగా భిన్నం. షూటింగ్ స్పాట్‌లో కూడా ఆమె పుస్తకాలతోనే కనిపిస్తుంది. ఆమెకు ఫిలాసఫీ, వరల్డ్ సినిమాపై మంచి అవగాహన ఉంది. అందుకే ఆమె విదేశాలకు వెళ్లి సినిమా కోర్సు చేయాలని భావించింది. అయితే, గుణశేఖర్ వంటి దర్శకులు ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి ‘యూఫోరియా’ వంటి బలమైన కథలతో ఆమెను ఇక్కడే ఆపగలిగారు.
అవార్డుల పంట..
సారా ‘నాన్న’ సినిమాకే కాదు, ‘సైగల్’ వంటి చిత్రాలకు కూడా అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ఉత్తమ బాలనటిగా విజయ్ అవార్డులు, సైమా అవార్డులు అందుకున్న సారా.. ఇప్పుడు హీరోయిన్‌గా కూడా అవార్డుల రేసులో నిలవడానికి సిద్ధమవుతోంది.
బహుభాషా నైపుణ్యం..
ఇతర భాషల్లో నటించే మహిళా నటులు చాలా మంది తమ పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ సారా... చిన్నప్పటి నుంచే హిందీ, తమిళం, తెలుగు భాషలపై పట్టు సాధించింది. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడు ఆయా భాషల్లోని యాసను పట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో ప్రాచీన తమిళ పదాలను ఉచ్ఛరించేందుకు ఆమె చేసిన కృషిని చూసి మణిరత్నం సైతం ఆశ్చర్యపోయారు.