ఈషా డియోల్: బతికున్నా నాన్న అలాంటివి పట్టించుకునేవారు కాదు...
ABN, Publish Date - Mar 17 , 2026 | 08:49 PM
నా తండ్రి ధరేంద్ర (Dharmendra) గుర్తింపు కోసమో, హోదా కోసమో ఎప్పుడూ పాకులాడలేదని ఈషా డియోల్ అన్నారు.
‘నా తండ్రి ధరేంద్ర (Dharmendra) గుర్తింపు కోసమో, హోదా కోసమో ఎప్పుడు పాకులాడలేదు. ఆస్కార్ (98th Oscar) వేదికపై నాన్న పేరు డిస్‌ప్లే కాకపోవడం వల్ల వచ్చిన నష్టం గానీ, ఇబ్బంది కానీ ఏమీ లేదు’ అని ఈషా డియోల్ అన్నారు. గతేడాది నవంబర్‌లో ధరేంద్ర మరణించారు. ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకలో ఆయనను స్మరించుకోకపోవడంపై వివాదం రేగింది. లైవ్ టెలికాస్ట్‌లో ఆయన పేరు లేకపోయినప్పటికీ, అకాడమీ అఫీషియల్ వెబ్‌సైట్ గ్యాలరీలో ఆయన పేరును చేర్చారు. దీనిపై దివంగత ధర్మేంద్రకు తగిన గౌరవం దక్కలేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన కుమార్తె ఈషా స్పందించారు. ఈ వేడుకలోని ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్‌లో ధర్మేంద్ర పేరు విస్మరించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా స్పందించారు.
‘ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌లో ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్‌లో నాన్న పేరు లేకపోవడం వల్ల ఆయనకు వచ్చిన నష్టమేమీలేదు. ఒకవేళ ఆయన బతికున్నా ఇలాంటి వేడుకల గురించి పట్టించుకునేవారు కాదు. ఆయన గుర్తింపు కోసమో, హోదా కోసమో ఎప్పుడూ ఆరాటపడలేదు. ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం మాత్రమే ముఖ్యం. ఇలాంటి వేదికలపై ఇచ్చే గౌరవాన్ని ఆయన కోరుకోరు' అని తెలిపారు. ఈ విషయంపై హేమమాలిని కూడా స్పందించారు. 'ఆస్కార్... ధర్మేంద్రను విస్మరించడం బాధాకరం. అయినప్పటికీ అభిమానుల ప్రేమే పెద్ద అవార్డుగా ఆయన భావించేవారు’ అని అన్నారు.