Monal Gajjar: క్యాన్సర్ సర్జరీతో కఠిన పరీక్ష.. నవంబర్ నేర్పిన జీవిత పాఠం!
ABN, Publish Date - Nov 28 , 2026 | 07:59 AM
జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ ఊహించలేరు. ఒకరోజు ఆనందంగా సాగిపోతున్న జీవితం.. మరుసటి రోజే అనుకోని పరీక్షను ఎదుర్కోవచ్చు.
జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ ఊహించలేరు. ఒకరోజు ఆనందంగా సాగిపోతున్న జీవితం.. మరుసటి రోజే అనుకోని పరీక్షను ఎదుర్కోవచ్చు. అలాంటి కఠినమైన అనుభవాన్నే ఎదుర్కొన్నారు నటి మోనాల్ గజ్జర్ (monal Gajjar) పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma) కారణంగా నవంబర్ 2న ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, ఆ కష్టమైన దశను ధైర్యంగా అధిగమించి, ఇప్పుడు మళ్లీ స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటూ, ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. నవంబర్ నెలలో సాగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "నేను భ్రమల్లో ఉన్నానని అనుకున్నా పర్వాలేదు.. నాకు కావాల్సిన ప్రతిదీ ఏదో ఒకరోజు తప్పకుండా దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను" అంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా పంచుకున్నారు.
నవంబర్ 2న సర్జరీ..
నవంబర్ 1న శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న సమయంలో తీసిన వీడియోను మోనాల్ గజ్జర్ షేర్ చేశారు. ఆ మరుసటి రోజే పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా కారణంగా ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడానికి సిద్ధమైన క్షణాల నుంచి ఆసుపత్రిలో గడిపిన రోజులు, కుట్లు, కోలుకునే ప్రయాణం వరకు ప్రతి అనుభవం తనకు ఎంతో ధైర్యాన్ని నేర్పించిందని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ, సోదరి ఇచ్చిన ఆత్మీయ స్వాగతం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని గుర్తుచేసుకున్నారు.
గురుమా ఆశీస్సులు!
"ఆ కష్టకాలంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు చూపించిన ప్రేమ, ఆప్యాయత నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. స్నేహితులు పంపిన పూల బొకేలు, వారి ఆత్మీయ సందేశాలు, నన్ను పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చికిత్స అందించిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నింటికంటే ముఖ్యంగా నా గురుమా ఆశీస్సులు, కృప నాకు ఎంతో అండగా నిలిచాయి" అని మోనాల్ పేర్కొన్నారు.
మళ్లీ సాధారణ జీవితంలోకి..
"క్రమంగా కోలుకుంటూ కుట్లు తొలగించుకోవడం, వైద్యులను కలిసి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం.. ఇలా ఒక్కో అడుగు ముందుకు వేశాను. నెమ్మదిగా నా సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చాను. ఇప్పుడు మళ్లీ స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటూ, కొత్త వ్యక్తులను కలుస్తూ, ప్రయాణాలు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. 'నువ్వు ఎలా ఉన్నావు?' అని చాలామంది అడుగుతున్నారు. వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే.. నేను చాలా బాగున్నాను. ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం..
"ఈ నవంబర్ నెల నాకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించింది. ముఖ్యంగా ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని అర్థమైంది. మన ప్రణాళికలు, గడువులు, విజయాలు, భౌతిక సంపదలు.. ఏవీ ఆరోగ్యం కంటే గొప్పవి కావు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. జీవితంలో ఒక్క రోజును, ఒక్క శ్వాసను, మనల్ని ప్రేమించే మనుషులను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దు.
నవంబర్ నన్ను పరీక్షించింది.. ఎన్నో పాఠాలు నేర్పించింది.. మరింత ధైర్యంగా మార్చింది. అన్నింటికంటే ముఖ్యంగా జీవితం ఎంత అందమైనదో మరోసారి గుర్తుచేసింది. నేను కోలుకున్నందుకు మాత్రమే సంతోషంగా లేను.. ఈ అందమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను" అని మోనాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.