Kangana Vs Hrithik: హృతిక్‌కు.. కంగన వార్నింగ్! మళ్లీ రచ్చ మొదలు
ABN, Publish Date - Aug 03 , 2026 | 07:24 AM
బాలీవుడ్‌లో మరోసారి హృతిక్ రోషన్-కంగన రనౌత్ వివాదం చర్చనీయాంశమైంది.
బాలీవుడ్‌లో ఒకప్పుడు పెద్ద చర్చకు దారితీసిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) - కంగన రనౌత్ (Kangana Ranaut) వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇద్దరి పేర్లను చర్చనీయాంశంగా మార్చాయి. ఈ మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్ జీ యువత ఆందోళనలపై కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలను విమర్శిస్తూ రాజకీయ నాయకుడు సౌరవ్ దాస్ స్పందించారు. దానికి కంగన కూడా ఘాటుగా బదులిచ్చారు.
తర్వాత సౌరవ్ దాస్ మరోసారి స్పందిస్తూ, తనను చూసి స్నేహితులు "హృతిక్ రోషన్‌లా ఉంటావు" అని అంటుంటారని, అందుకే కంగన తనపై విమర్శలు చేస్తున్నారేమో అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పాత హృతిక్-కంగన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ నేపథ్యంలో #HrithikRoshanApologizeToKangana అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు సంబంధించిన ఓ పోస్టుపై హృతిక్ రోషన్ స్పందిస్తూ, "ఒక వ్యక్తి నచ్చలేదని మరో వ్యక్తి వైపు నిలబడటం సమాజంలో సమస్యగా మారుతోంది" అనే భావం వచ్చేలా కామెంట్ చేశారు.
అయితే.. ఇప్పుడు హృతిక్ స్పందనపై కంగన రనౌత్ కూడా వెంటనే స్పందించారు. తన పేరును ఉపయోగిస్తూ తనను లక్ష్యంగా చేసుకునే వారిని ఖండించాల్సింది పోయి, అలాంటి వ్యాఖ్యలకు పరోక్షంగా బలం చేకూర్చేలా వ్యవహరించవద్దని హృతిక్‌ను ఉద్దేశించి పోస్టు చేశారు. "మంటల్లో పెట్రోల్ పోయొద్దు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య విభేదాలు 2016లో మొదలయ్యాయి. క్రిష్ 3 సినిమా సమయంలో ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌తో ప్రేమ సంబంధం ఉన్నట్లు కంగన చెప్పగా, హృతిక్ ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత బంధం లేదని అప్పట్లో స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.