Taapsee: వయసు పెరిగేది మాకేనా.. హీరోలకు పెరగదా?
ABN, Publish Date - Jun 08 , 2026 | 10:14 PM
ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా మెరిసిన తాప్సీ పన్ను.. ఇప్పుడు బాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా మెరిసిన తాప్సీ పన్ను (Taapsee Pannu) ఇప్పుడు బాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సినిమాల ఎంపికలోనే కాదు, తన అభిప్రాయాలను నేరుగా చెప్పడంలోనూ తాప్సీ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నకు తాప్సీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఆన్‌లైన్‌లో కనిపించాలనే ఒత్తిడిలో ఉన్నారని, ప్రతి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉండటం తరుచూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని అందుకే గత ఏడాదిగా సోషల్ మీడియాలో యాక్టివిటీ తగ్గించానని వెల్లడించింది. "నేను సోషల్ మీడియాను పూర్తిగా వదిలేయలేదు. కానీ నా జీవితమంతా దానిచుట్టూ తిరగాలని కూడా అనుకోవడం లేదు" అంటూ తన నిర్ణయం వెనుక గలకారణాన్ని వివరించింది.
ఇంకా ఇంటర్వ్యూలో.. వయసుకు సంబంధించిన ప్రశ్నకు తాప్సీ మాట్లాడుతూ.. "ఒక హీరోయిన్‌కు గుర్తింపు రావడానికి ఐదేళ్లు పడుతుంది. అప్పటికి ఆమె వయసు 30 దాటుతుంది. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలకు మీ వయసు సరిపోదు అంటారు. కానీ అదే లాజిక్ హీరోలకు ఎందుకు వర్తించదు?" అంటూ ప్రశ్నించింది. వినోదాత్మక పాత్రలు, ప్రేమకథలు చేయడానికి వయసుతో సంబంధం లేదని, కానీ మహిళల విషయంలో మాత్రం ఇలాంటి పరిమితులు పెట్టడం ఇప్పటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోనూ కనిపిస్తోందని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు సౌత్ ఇండస్ట్రీపై పలుమార్లు వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ ఇప్పుడు మరోసారి ఆ తరహా వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచింది.