దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Nov 04 , 2026 | 07:04 AM
దీపావళి సందర్భంగా పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని దియా మీర్జా చేసిన ప్రచార వీడియో తొలగింపుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న నటి దియా మీర్జా (Dia Mirza) ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడంపై బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ నేతల అభ్యంతరాల నేపథ్యంలో తొలగించిన ఆ వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) (Brihanmumbai Municipal Corporation)ను ఆదేశించింది.
దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎంసీ ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నటీమణులు దియా మీర్జా, మాధురీ దీక్షిత్ (Madhuri Dixit), క్రికెటర్ ఆజింక్య రహానే (Ajinkya Rahane) తదితర సెలబ్రిటీలతో ప్రచార వీడియోలు రూపొందించి, వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. దియా మీర్జా తన వీడియోలో హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. రహదారులపై బాణసంచా కాల్చవద్దని, పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దీనిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే (Nitesh Narayan Rane) సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.దీంతో బీఎంసీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి దియా ప్రచార వీడియోను తొలగించింది. ఈ నిర్ణయంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది. కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు చేసిన వీడియోకి మతం రంగు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది."గాలికి కులం, మతంతో సంబంధం లేదు" అని పేర్కొంది.