సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చెల‌రేగిపోతున్న ధురంధ‌ర్‌.. ప‌ట్టించుకోని బాలీవుడ్‌! తెలుగులోనూ విధ్వంసం

ABN, Publish Date - Mar 23 , 2026 | 03:40 PM

ధురంధర్ సీక్వెల్‌గా వచ్చిన ద రివేంజ్‌ ఆఫ్‌ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజైన వారం కూడా గడవకముందే 600 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

Dhurandhar

ఇండియన్‌ సినిమా చరిత్రలో బాహుబలి ఒక పెను మార్పును తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత భాషా భేదాలు చెరిగిపోయాయి. కథ బాగుంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ ఇవాళ గ్లోబల్ లెవల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్ వర్గాలే, ఇవాళ మన సినిమా రైట్స్ కోసం క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా, మన సినిమాలకు అక్కడ లభిస్తున్న ఆదరణ చూసి బాలీవుడ్ (Bollywood) మేకర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ, ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అదే ధురంధర్ 2 (Dhurandhar The Revenge) చుట్టూ జరుగుతున్న చర్చ.

ధురంధర్ మొదటి భాగం కేవలం హిందీలోనే రిలీజై 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ద రివేంజ్‌ ఆఫ్‌ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజైన వారం కూడా గడవకముందే 600 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. హిందీలో మార్చి 19న రిలీజ్‌ కాగా, తెలుగు, తమిళంలో మాత్రం ఈ నెల 21నుంచి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకే మతిపోతోంది. ప్రతి ఒక్కరికీ అవగతమైన విషయమేమిటంటే, ఈ సినిమా రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయడం ఖాయం.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా ఇక్కడ ఇంతలా రికార్డులు బద్దలు కొడుతుంటే, బాలీవుడ్ వర్గాలు మాత్రం అంతుచిక్కని మౌనాన్ని పాటిస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తారు. కానీ ధురంధర్-2 విషయంలో హిందీ ఇండస్ట్రీ ఎందుకు నోరు మెదపడం లేదు? సొంతగడ్డపై ఇంతటి భారీ వసూళ్లు సాధిస్తున్న సినిమాను వారు ఓన్ చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారా? మరోవైపు చూస్తే, మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే 600 కోట్లు దాటినా బాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తమ ఇండస్ట్రీ నుంచి ఒక సెన్సేషనల్ హిట్ వస్తే నెత్తిన పెట్టుకునే బాలీవుడ్ వర్గాలు, ఈ సినిమాను ఎందుకు అక్కున చేర్చుకోవడం లేదు అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. కేవలం ఈ సినిమాలోని పొలిటికల్‌ అంశాలను మాత్రమే తీసుకొని సినిమాపై నెగిటివ్‌ ప్రొపగండా మొదలుపెట్టారు. అక్కడి రివ్యూవర్స్‌, బాలీవుడ్‌ స్టార్స్‌ ఈ సినిమాను మెచ్చుకోకపోగా విమర్శలు ఎక్కువగా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పైగా బ‌డా కంపెనీల‌, ఖాన్ సినిమాల రికార్డులను చెరిపేయడం అక్కడి వారికి నచ్చకనో లేక మరేదైనా కారణమో తెలియదు. అయినా కూడా ధురంధర్-2 సృష్టిస్తున్న విధ్వంసం మాత్రం ఆగడం లేదు.

కేవలం వారం రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే, లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో ఊహించడం కూడా కష్టమే. ఏది ఏమైనా, ధురంధర్-2 ఒక ప్రాంతానికో, ఒక భాషకో పరిమితం కాకుండా ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. బాలీవుడ్ మౌనం వహించినా, ఇండియన్‌ వైడ్‌ సినిమా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా ఈ సినిమాపై బాలీవుడ్‌ సైలెన్స్‌ వీడుతుందో లేదో చూడాలి.

Updated Date - Mar 23 , 2026 | 03:40 PM