పుష్ప 2.. రికార్డ్ బ్రేక్ చేసిన 'ధురంధర్ 2'
ABN, Publish Date - Apr 20 , 2026 | 06:48 AM
భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో 'ధురంధర్ 2' ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది.
రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 (Dhurandhar The Revenge) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 31 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 1,749.01 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఇదొక అరుదైన మైలురాయిగా నిలిచిపోయింది.
భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో 'ధురంధర్ 2' ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు రూ. 1,742 కోట్లతో మూడవ స్థానంలో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2: The Rule) రికార్డును ఈ చిత్రం నెల రోజుల్లోనే అధిగమించడం విశేషం. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 1,329.31 కోట్లు రాబట్టగా, ఓవర్‌సీస్‌లో రూ. 419.70 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా కంటే ముందు రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లతో అమిర్ ఖాన్ 'దంగల్', రూ. 1,810 కోట్లతో రాజమౌళి 'బాహుబలి 2' ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో బాహుబలి రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పాకిస్తాన్ స్పై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా, రాకేశ్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, మానవ్ గోహిల్ తమ నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.
థియేటర్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ఓటీటీ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ధురంధర్ 2' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 150 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. మొదటి భాగం కంటే రెండవ భాగానికి రెట్టింపు ధర లభించడం ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. త్వరలోనే దీని స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు.