దీపిక పదుకొణే... అప్పుడలా... ఇప్పుడిలా...
ABN, Publish Date - Mar 21 , 2026 | 01:26 PM
రణవీర్ సింగ్ 'ధురంధర్ 2'తో సాధించిన విజయం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అభినందిస్తున్నారు. అయితే రణవీర్ సింగ్ భార్య దీపికా పదుకొణే ఇంతవరకూ ఈ విషయమై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) 'ధురంధర్ 2' (Dhurandhar 2)తో మరో గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 'ధురంధర్' మూవీని మించిన విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందని, ఈసారి రూ. 1500 కోట్ల గ్రాస్‌ను 'ధురంధర్ 2' కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెగ్యులర్ మూవీ గోయర్స్ మాత్రమే కాకుండా సినిమా రంగానికి చెందిన వారు సైతం 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియచేస్తున్నారు. అయితే... ఇవన్నీ ఒక ఎత్తు కాగా, రణవీర్ సింగ్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) ఈ సినిమా విజయంపై ఏం స్పందిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే... డిసెంబర్ 5న 'ధురంధర్' చిత్రం విడుదల కాగానే దీపిక తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. కానీ ఈసారి ఆమె వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక కారణం తెలియక ఆమె అభిమానులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదివరకు రణవీర్ సింగ్ ఏ చిన్న విజయం సాధించినా, దేనిని అఛీవ్ చేసినా... దీపికా పదుకుణే వెంటనే స్పందించేవారు, భర్తను అభినందించేవారు. అయితే ఇప్పుడు ఇంత గొప్ప విజయాన్ని రణవీర్ అందుకున్నా... ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీపికా పదుకొణే కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉందని కొందరు అంటుంటే... వ్యక్తిగత కారణాల వల్ల ఆమె స్పందించలేదేమోనని మరి కొందరంటున్నారు. ఇంకొందరైతే... వీరి మధ్య ఏమైనా అభిప్రాయబేధాలు వచ్చి ఉండచొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీపికా పదుకొణే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటోందని, సినిమా విడుదలై రెండు రోజులే అయ్యింది కాబట్టి, ఈ వీకెండ్ లోపు ఆమె తన అభిప్రాయాన్ని చెప్పొచ్చని మరికొందరు అంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!