డేవిడ్ ధావన్ రిటైర్మెంట్!
ABN , Publish Date - May 25 , 2026 | 06:02 PM
డేవిడ్ ధావన్ సినిమాలు యంగ్ డైరెక్టర్లకు ఒక పాఠం. కామెడీకి కొత్త అర్థం చెప్పిన క్రియేటర్ ఆయన. అలాంటి దిగ్గజం ఇక సినిమాలు తీయబోనని ప్రకటించడంతో బాలీవుడ్ ఎమోషనల్ అవుతోంది. సెలబ్రెటీలందరూ తీవ్ర భావోద్వాగానికి గురవుతున్నారు.
బాలీవుడ్ హాస్య దర్శకుల్లో దిగ్గజుడైన డేవిడ్ ధావన్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. తన కుమారుడు వరుణ్ ధావన్ నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రమే తన ఆఖరి సినిమా అని ఆయన ప్రకటించారు. ఇటీవల ముంబైలో డేవిడ్ ధావన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను పీవీఆర్ ఐనాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించి, ఆయన సినీ సేవలను గౌరవించారు. ఈ వేడుకకు వరుణ్ ధావన్, కరణ్ జోహార్ హాజరు కాగా, దర్శక నిర్మాత కరణ్ జోహార్... డేవిడ్ ధావన్ రిటైర్‌మెంట్ విషయం తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన కరణ్... బాలీవుడ్‌లో స్వచ్ఛమైన వినోదానికి మారుపేరు డేవిడ్ ధావన్ సినిమాలు అని... ఆయన సరికొత్త హాస్య శైలిని సృష్టించారని కొనియాడారు. అలాంటి దర్శకుడి నిర్ణయం తన హృదయాన్ని కలిచివేసిందని తెలిపారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చివరి సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలని ఆకాంక్షించారు.
డేవిడ్ ధావన్ తన 43 ఏళ్ల సినీ ప్రయాణంలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, గోవింద, అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్లతో ఎన్నో హిట్ సినిమాలు తీశారు. అందుకే ఆయనను బాలీవుడ్ 'కింగ్ ఆఫ్ కామెడీ'గా పిలుస్తుంది. ఆరేళ్ళ విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంలో వరుణ్ ధావన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే, మౌనిరాయ్ నటిస్తున్నారు. రమేష్ తౌరానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ జూన్ 5న విడుదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ
10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?
జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!