కాశ్మీరీలకు కొత్త అనుభూతినిచ్చిన చిత్రోత్సవం

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:43 PM

ఇటీవల కశ్మీర్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 41 దేశాలకు చెందిన 135 చిత్రాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు దాల్‌ సరస్సులో తేలియాడే తెరపై సినిమాలు ప్రదర్శించడం విశేషం.

Movies on Dal Lake

కశ్మీర్‌ అనగానే అందరికీ గుర్తొచేవి యాపిల్ పళ్ళు, అలానే అక్కడి దాల్‌ సరస్సు. యాపిల్‌ పళ్ళు ఆరగిస్తూ, దాల్‌ సరస్సులో విహారం చేయాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. అయితే కోట్లాది మందికి ఆ కోరిక కేవలం కొన్ని సినిమాల ద్వారానే తీరుతుంటుంది. భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన సినిమాలు కశ్మీర్‌లో షూటింగ్‌ జరుపుకునేవి. హిందీతో పాటు పలు తెలుగు సినిమాల షూటింగ్‌ కూడా అక్కడ జరిగింది. అయితే తీవ్రవాదం ఎప్పుడైతే కశ్మీర్ లోయలో పెరిగిపోయిందో సినిమా జనం నిదానంగా కశ్మీర్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరపడానికి జంకడం మొదలు పెట్టారు. పైగా అక్కడి రీగల్‌ థియేటర్ ను రీ-ఓపెన్ చేసినప్పుడు ఉగ్రవాదులు దానిపై చేసిన దాడిలో ఓ ప్రేక్షకుడు చనిపోగా, పలువురు గాయపడ్డారు. దాంతో అక్కడ సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం చొరవచూపించి, తిరిగి అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ల ను ప్రారంభించడానికి ప్రోత్సాహం కల్పించడమే కాదు... ఏకంగా ఈసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని జరిపింది. దాంతో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ శ్రీనగర్ లోని ప్రపంచ ప్రఖ్యాత దాల్ సరస్సు సినిమా హాలును తలపించింది. ఇది లోయలో మునుపెన్నడూ లేని విధంగా ఒక వినూత్న చలనచిత్ర అనుభూతిని కలిగించింది.


సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ జరిగిన చిత్రోత్సవంలో 41 దేశాల నుంచి 135 చిత్రాలను ప్రదర్శించారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా, షేర్-ఎ - కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో, సరస్సు ప్రశాంత జలాలపై ఒక పెద్ద తేలియాడే తెరను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకమైన బహిరంగ థియేటర్లో, ప్రేక్షకులు 'షికారా' పడవల్లో కూర్చుని సినిమాలు చూశారు. ఇక్కడ జరిగిన సినిమాల ప్రదర్శన హిందీ సినిమాతో కశ్మీర్ కు ఉన్న సుదీర్ఘమైన, బలమైన అనుబంధాన్ని కూడా గుర్తుచేసింది. చుట్టూ నీరు ఉండగా, క్లాసిక్ సినిమాల్లోని సుపరిచితమైన పాటలు, సన్నివేశాలను చూస్తున్నప్పుడు, ఆ వాతావరణం ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ను సృష్టించింది. చలన చిత్రోత్సవం మొదలైన సెప్టెంబర్ 7న 1961 నాటి 'జంగ్లీ' చిత్రాన్ని ప్రదర్శించారు. సరస్సు ఒడ్డున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, నీటిపై మెరుస్తున్న ఆ తెరపై ప్రదర్శితమైన సినిమాను చూసి ఆనందించారు. సెప్టెంబర్ 8న 'అర్జున్' చిత్రాన్ని ప్రదర్శించారు. సెప్టెంబర్ 9న షమ్మీ కపూర్, షర్మిలా ఠాగూర్ నటించిన క్లాసిక్ మూవీ 'కశ్మీర్ కీ కలి' ప్రదర్శితమైంది. చిత్రోత్సవం చివరి రోజైన సెప్టెంబర్ 10న, యశ్ చోప్రా రూపొందించిన చిరస్మరణీయ చిత్రం 'కభీ కభీ'ని ప్రదర్శించారు. కశ్మీర్ ఉన్న గాఢమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాలను ఎంపిక చేసినట్టు అర్థమౌతుంది. దశాబ్దాలుగా, ఈ లోయలో ఎన్నో విజయవంతమైన హిందీ చిత్రాలను చిత్రీకరించారు. అలాగే, దాల్ సరస్సు, పెహల్గావ్ వంటి ప్రదేశాలు సినీ ప్రేక్షకుల స్మతి పథంపై చెరగని ముద్ర వేశాయి. ఈ 'తేలియాడే సినిమా' ఆ అనుబంధానికి ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు కేవలం తెరపై కశ్మీరు చూడటమే కాకుండా, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిచ్చిన ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటూ సినిమాను ఆస్వాదించారు. అయితే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఉద్దేశ్యం కేవలం వినోదానికి పరిమితం కాదు, జమ్మూకశ్మీర్‌ ను ప్రపంచానికి ఒక విభిన్న కోణంలో పరిచయం చేయడమే దీని లక్ష్యం. కశ్మీర్‌ను ప్రకృతి సౌందర్యానికి అతీతంగా చూడాల్సిన అవసరాన్ని ఈ ఉత్సవానికి హాజరైన పలువురు చిత్రనిర్మాతలు, కళాకారులు ప్రధానంగా ఈ వేడుకలో ప్రస్తావించారు. అక్కడి ప్రజల కథలు, సంప్రదాయాలు, స్థానిక సంస్కృతిని తెరపైకి తీసుకురావాలని సూచించారు. సాధారణంగా ప్రజలు షికారా సవారీల కోసం దాల్ సరస్సుకు వస్తారు, కానీ ఈసారి సరస్సే ఒక సినిమా హాల్‌ గా మారిందని, ఈ భావనను కశ్మీరీ కుటుంబాలు, యువత ఒకేలా ఆస్వాదించారని అక్కడి వారు చెప్పుకున్నారు.


ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే కాకుండా, స్థానిక ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరిచింది. ఈ లోయ చరిత్రలో, ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బహిరంగ ప్రదేశంలో ప్రేక్షకులకు సినిమాలను అందించడం ఇదే మొదటిసారి. సినిమా సంప్రదాయ ఆడిటోరియం పరిధిని దాటి నేరుగా ప్రజల వద్దకు చేరింది. సాధారణంగా పర్యాటకం విహారయాత్రలతో ముడివడి ఉండే 'షికారాలు' సినిమా సీట్లుగా మారాయి. ఇది సినిమాతో కశ్మీరుకు ఉన్న చిరకాల అనుబంధానికి, దాని గొప్ప సాంస్కృతిక వైభవానికి ఉదాహరణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి

యాక్షన్‌, హర్రర్‌ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు

‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!

Updated Date - Sep 19 , 2026 | 04:54 PM