డైసీ షా: పెళ్లితో పనిలేదు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిని కాగలను
ABN, Publish Date - Feb 27 , 2026 | 03:46 PM
బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి మెప్పించిన బ్యూటీ డైసీ షా. సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి మెప్పించిన బ్యూటీ డైసీ షా (Daisy Shah). సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' (Jai ho) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా వ్యక్తిగత నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. 41 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లిపై ఆసక్తి లేదని, ఒంటరిగానే ఉండటం ఇష్టమని చెప్పింది. 'ఎగ్ ఫ్రీజింగ్' (Egg freezing) వంటి విషయాలపై ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి లేకుండా ఫ్యామిలీని ఎలా ప్లాన్ చేయొచ్చు అన్న దానిపై ఆమె మాట్లాడారు. 'నా జీవితంలో పెళ్లికి చోటు లేదు. నా చుట్టూ ఉన్న జంటలు విడిపోతున్న వార్తలు వింటుంటే చాలా భయమేస్తుంది. నాకు ఒక తోడు కావాలని నేను అనుకోవడం లేదు. నేను నా సొంతంగా బాగానే సంపాదిస్తున్నాను. కేవలం తియ్యటి మాటలు చెప్పే వారిని నమ్మి పెళ్లి చేసుకునే స్థితిలో నేను లేను. ప్రేమ అనేది మొదట్లో బాగుంటుంది కానీ, ఆ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్థలు భరించడం చాలా కష్టం' అని అన్నారు.
అలాగే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆమె మాట్లాడారు. 'తల్లి కావడానికి పెళ్లితో సంబంధం లేదు. నేను ఇప్పటికే నా 'ఎగ్స్‌ని ఫ్రీజ్' చేయించాను. కాబట్టి భవిష్యత్తులో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తల్లిని కాగలను. కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి కేవలం పెళ్లి మాత్రమే దారి కాదు. పిల్లల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, టెక్నాలజీ సాయంతో నాకు నచ్చినప్పుడు సొంత బిడ్డను కనే అవకాశం ఉంది. కేవలం ప్రేమ ఉంటే ఈ రోజుల్లో కడుపు నిండదు. డబ్బు ఉంటేనే మనిషికి ప్రశాంతత. ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం. నా దగ్గర తగినంత డబ్బు ఉంది, కానీ నా జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా ఒక స్థాయిని కలిగి ఉండాలి. పెళ్లి చేసుకుని మరొకరి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.