మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 12 , 2026 | 03:35 PM
నటి మోనాలిసా వివాహంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ నేతలు ఈ వివాహన్ని తప్పు పట్టగా, ఇది లవ్ జీహాద్ అని దర్శకుడు సనోజ్ మిశ్రా వ్యాఖ్యానించాడు.
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతున్న యువతిగా జనాలకు పరిచయమైన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle)... ఇవాళ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆమెను సినిమా నటి చేయాలని దర్శక నిర్మాత సనోజ్ మిశ్రా (Sanoj Mishra) ప్రయత్నం చేశారు. ఆమెతో సినిమా సన్నాహాలు చేశారు. అయితే మధ్యలో అతనిపై కేసు నమోదు కావడంతో జైలు జీవితాన్ని గడిపి వచ్చారు. ఈలోగా మోనాలిసా ఇతర చిత్రాలలో నటించడం మొదలు పెట్టింది. తెలుగులోనూ 'లైఫ్' (Life) అనే మూవీలో ఆమె నటిస్తోంది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు ఓపెనింగ్స్‌కూ ఆమె గెస్ట్‌గా హాజరవుతోంది.
తాజాగా ఆమె ముస్లిం యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకోవడంపై విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) అభ్యంతరం వ్యక్తం చేసింది. వీహెచ్‌పీ (VHP) కేరళ యూనిట్ నేతలు మోనాలిసా మైనర్ బాలిక అని, ఆమె వివాహం చెల్లదని, దీనికి కారకులైన వ్యక్తులపై పోక్సో కేసు పెట్టాలని వాదించారు. మోనాలిసా 2009 జనవరి 21న జన్మించిందని ఆమె తల్లి చెప్పినట్టుగా వారు తెలిపారు. అయితే ఆమె పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ గ్రామ పంచాయితీలో 2008 జనవరి 1న జన్మించినట్టుగా ఉంది. ఆ రకంగా చూస్తే ఆమె మైనారిటీ తీరినట్టే! ఈ ధ్రువపత్రాలను కేరళ రాష్ట్రానికి చెందిన 'కె-స్మార్ట్' పోర్టల్ సమాచారంతో సరిచూసుకున్న తర్వాతనే మోనాలిసా పెళ్ళికి పోలీసులు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. మోనాలిసా తల్లి ఇచ్చిన సమాచారం ప్రకారం తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని వి.హెచ్.పి. నేతలు తెలిపారు. అయితే ఆమె తల్లి ఇచ్చిన సమాచారంలో వాస్తవం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మోనాలిసాను సినిమా రంగానికి పరిచయం చేయాలని ప్రయత్నించిన దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా చేసింది తిరుగుబాటు కాదని, లవ్ జీహాద్ అని విమర్శించారు. ఆమెతో సినిమా చేయడానికి తాను 10 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నానని, ఆమెను హీరోయిన్ చేయాలనే ప్రయత్నంలో కొందరు అడ్డు తగలడంతో జైలు జీవితాన్ని గడిపానని, ఇప్పుడు ఆమె ఓ ముస్లింతో పారిపోవడం బాధకు గురి చేసిందని సనోజ్ మిశ్రా వాపోతున్నారు. మోనాలిసా మాత్రం... తన తండ్రి ఇష్టం లేని వివాహం చేయాలనుకోవడం వల్లే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళ పోలీసులు, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో వివాహం చేసుకున్నానని, ఈ ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపింది.