Kriti Sanon: ఎంత సాధించినా... ప్రశాంతత లేకపోతే వ్యర్థమే
ABN, Publish Date - Aug 16 , 2026 | 09:20 AM
కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది.
వెండితెరపై నిత్యం చిరునవ్వులు చిందిస్తూ, విద్యుత్ వెలుగుల్లో దివ్యమైన తారల్లా మెరిసిపోయే నటీనటుల జీవితం బయట నుంచి చూసే సగటు ప్రేక్షకుడికి ఒక అందమైన కలలా, ఊహల స్వర్గంలా కనిపిస్తుంది. కానీ కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది.
‘చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకొక బలమైన నమ్మకం, ఒక రకమైన అజ్ఞానంతో కూడిన ధైర్యం ఉండేది. సెట్ మీద నేను పోషించే పాత్రలు కేవలం కెమెరా ఆన్‌లో ఉన్నంత వరకు మాత్రమే పరిమితమని మొదట్లో అనుకునేదాన్ని. షూటింగ్ అయిపోగానే ఆ మేక్‌పతో పాటు ఆ పాత్రల భావోద్వేగాలను కాస్ట్యూమ్ రూమ్‌లోనే విప్పేసి, నా వ్యక్తిగత జీవితంలోకి ప్రశాంతంగా వెళ్లిపోగలనని గట్టిగా నమ్మేదాన్ని. కానీ, ఆ నమ్మకం ఎంతో కాలం నిలవలేదు.
మార్పు తెచ్చిన చిత్రాలు
నేను నటించిన ‘మిమి’, ‘దో పట్టీ’ వంటి సినిమాలు నా నటనా ప్రయాణంలోనే కాదు, నా జీవితంలో అంతర్గతంగా ఉండే ఆలోచనా విధానంలోనూ మార్పు తెచ్చాయి. తీవ్రమైన మానసిక ఘర్షణలతో, నమ్మకద్రోహం, వేదన, మాతృత్వం వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఆ పాత్రలు చేస్తున్నప్పుడు నాకొక చేదు నిజం బోధపడింది. మనం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నా, మన ఆలోచనలతో ఆ పాత్రలకు సంబంధం లేదని మన మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా. మనం పోషించే ప్రతీ తీవ్రమైన పాత్ర మన సుప్తచేతనావస్థ (సబ్‌కాన్షియ్‌స్ )పై ఒక నిశ్శబ్దమైన, నిగూఢమైన, లోతైన ముద్ర వేస్తూనే ఉంటుంది.
ఆ పాత్రల నిశ్శబ్ద ఛాయలు
షూట్ సమయంలో డైరెక్టర్ ‘కట్’ చెప్పిన వెంటనే లేదా ఒక ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం పూర్తయిన మరుక్షణమే ఆ ప్రభావం నాలో బయటపడకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాతో, లేదా ఒక వారం రోజులు గడిచాకో నా రోజువారీ ప్రవర్తనలో మార్పులొచ్చేవి. నేను ఇతరులతో మాట్లాడే విధానంలో లేదా నా చుట్టూ ఉన్న పరిస్థితులకు నేను స్పందించే తీరులో ఆ పాత్రల ఛాయలు స్పష్టంగా, నిశ్శబ్దంగా కనిపించడం మొదలయ్యేవి. అప్పుడే నాకు ఒక ముఖ్యమైన పాఠం బోధపడింది.
విడదీయడమూ ఒక కళే!
ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించడం ఎంత పెద్ద కళో, ఆ పని పూర్తయ్యాక మన మనసును ఆ పాత్ర భావోద్వేగాల నుంచి విడదీయడం కూడా అంతే ముఖ్యం. తిరిగి మన సొంత వ్యక్తిత్వంలోకి మనసును తీసుకురావడం కూడా అభ్యాసంతో కూడిన కళ అని నేను గ్రహించాను. లేకపోతే ఆ పాత్రల బరువు మనల్ని నిరంతరం నలిపేస్తుంది.
గుండెల్లో నరకం!
నటిగా నా వృత్తిపరమైన జీవితంలో నేను ఎదుర్కొన్న అతిపెద్ద, క్లిష్టమైన సవాలు ఏమిటంటే... నా వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను, వృత్తిపరమైన బాధ్యతలను వేర్వేరుగా ఉంచడం! ఇది వినడానికి చాలా తేలికగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో నరకానికి సమానం. నా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, మనసు భావోద్వేగాలతో నలిగిపోతూ, హృదయం ఎంతో భారమై నాలో నేను కుమిలిపోతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. లోపల ఏదో తెలియని నిరాశ నా మనసును తొలిచేస్తున్న వేళల్లో కూడా... నేను సమయానికి సెట్‌కి వెళ్లాల్సి వచ్చేది.
కన్నీళ్ల సుడిగాలి మధ్య కామెడీ!
ఇక్కడ క్రూరమైన నిజం ఏమిటంటే... నా మనసు పూర్తిగా కుంగిపోయి, ఒంటరిగా కూర్చుని ఏడవాలనిపించే క్షణాల్లోనే నేను పూర్తిస్థాయి కామెడీ సినిమాల షూటింగ్‌లలో పాల్గొనాల్సి వచ్చింది. నా లోపల కన్నీళ్ల సుడిగాలి తిరుగుతుంటే, గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తుంటే, సరిగ్గా కెమెరా ముందుకు వచ్చి ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ, పకపకా నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను మైమరపించాల్సి వచ్చేది. ఇది నా జీవితంలో ఒకటో రెండోసార్లు కాదు, అనేక సందర్భాల్లో జరిగింది. బయటి ప్రపంచానికి నవ్వించడం సులభంగానే అనిపిస్తుంది. హృదయాల్లో కొండంత బాధను దాచుకుని, బాహ్య ప్రపంచానికి వినోదాన్ని పంచడం నటీనటుల వృత్తిధర్మమే కావచ్చు..కానీ మానసికంగా అది ఒక మనిషిని పిండి, పిప్పిచేసే అతిపెద్ద అగ్నిపరీక్ష!
మనసు గాయాలకు సంజీవని!
నటులుగా మేము నిరంతరం భావోద్వేగాల సముద్రంలో ఈత కొడుతుంటాం. రోజూ రకరకాల సన్నివేశాల ద్వారా మనలోని రకరకాల భావాలను లోతుగా తవ్వి తీస్తూ, వాటిని స్క్రీన్ పై ప్రదర్శిస్తుంటాం. అందుకే మన మానసిక, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని నేను గట్టిగా నమ్ముతాను. మన శరీరానికి ఏదైనా గాయమైతే వెంటనే కట్టుకడతాం, మందులు వాడతాం... మరి కంటికి కనిపించకుండా లోపల మనసుకు అయ్యే గాయాలకు, పడే క్షోభకు ఏం చేయాలి?
అదే నిజమైన విజయం!
అందుకే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నాలాంటి నటీనటులు ధ్యానం, లేదా థెరపీ ... ఇలా తమ మనసుకు ప్రశాంతతనిచ్చే ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవడం చాలా ముఖ్యం. నేను వ్యక్తిగతంగా తరచుగా ధ్యానం చేస్తుంటాను. అది నా మనసులోని అశాంతిని, కలవరాన్ని తొలగించి, నన్ను మళ్లీ అంతర్గతంగా స్థిరపరుస్తుంది. మన భావోద్వేగాలను రీచార్జ్ చేసుకోవడానికి అది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇటీవల నేను, షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’ వంటి భారీ చిత్రంలో నటిస్తున్నప్పుడు కూడా, నా మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తూనే పనిచేశాను. గ్లామర్ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని జాతీయ అవార్డులు సాధించినా... రోజు చివరికి మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ విజయాలకు, ఆ చప్పట్లకు ఏమాత్రం అర్థం ఉండదు. బాహ్య ప్రపంచాన్ని గెలవడం కాదు, మన అంతరంగాన్ని నిగ్రహించుకుని మనసును కాపాడుకోవడమే నిజమైన విజయమని నేను గ్రహించాను. వెండితెరపై మేం పూయించే నవ్వుల వెనుక ఎవరూ ఊహించని భావోద్వేగాల సుడిగుండాలు ఉంటాయి. కెమెరా ఆఫ్ కాగానే పాత్రల ప్రభావం ముగిసిపోదు. సొంత జీవితంలో గుండె పగిలే బాధ ఉన్నా, స్క్రీన్ మీద నవ్వులు చిందించడం నటులకు ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష. నిరంతరం భావోద్వేగాలతో ఆడుకునే మా లాంటి వారికి థెరపీ లేదా ధ్యానం ద్వారా మనశ్శాంతిని కాపాడు కోవడం ఎంతో అవసరం. గ్లామర్ ప్రపంచంలో