రాణీ ముఖర్జీ: ‘మర్దానీ’ కథలు సమాజానికి అవసరం!

ABN , Publish Date - Feb 15 , 2026 | 10:15 AM

‘మర్దానీ’ ఫ్రాంచైజీ రాణీ ముఖర్జీని ఒక్కసారిగా హీరోని చేసింది. పోలీస్‌ అధికారిణిగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ తన సత్తా చాటుకుంటోంది.

‘మర్దానీ’ ఫ్రాంచైజీ రాణీ ముఖర్జీని ఒక్కసారిగా హీరోని చేసింది. పోలీస్‌ అధికారిణిగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ తన సత్తా చాటుకుంటోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో అందర్నీ ఆకట్టుకున్న సివంగి శివానీ తాజాగా ‘మర్దానీ 3’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ముచ్చట్లివి...

‘మర్దానీ’ ఉద్దేశం అదే...

పన్నెండేళ్ల క్రితం... ‘మర్దానీ1’ ట్రైలర్‌ విడుదల కాగానే చాలామంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి ‘మేం ఈ సినిమా చూడలేం. ఇబ్బందికరంగా ఉంది’ అన్నారు. అంటే సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను అందులో చూసేసరికి ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోయారని అర్థమైంది. నిజానికి ‘నిర్భయ’ సంఘటనతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాంటి నిజ జీవిత సంఘటనలతో వచ్చిందే... ‘మర్దానీ’. ఈ సినిమా ఉద్దేశం ప్రేక్షకులను భయపెట్టడం కాదు... నిజాన్ని చూపించి, ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పడం. ఇలాంటి కథలు సమాజానికి అవసరమని నమ్ముతా. అందుకే ఈ ఫ్రాంచైజీని కొనసాగిస్తున్నా.

ఆ గొలుసు వెనక...

నేను జాతీయ అవార్డు తీసుకునేప్పుడు అక్కడే ఉండి చూడాలని నా కూతురు అదిరా ఎంతో ఆశ పడింది. కానీ, రాష్ట్రపతిభవన్‌లో జరిగే వేడుకకు 14 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దాంతో నాకెంతో ప్రత్యేకమైన రోజు నా పక్కన లేకపోయింది. అందుకే తన పేరు మీద గొలుసు చేయించుకుని మెడలో వేసుకున్నా. నేను నటించిన ‘హిచ్కీ’, ‘తోడా ప్యార్‌ తోడా మ్యాజిక్‌’, ‘బంటీ ఔర్‌ బబ్లీ’ సినిమాలు తనకి చాలా ఇష్టం.  


ఆలోచనా విధానం మారాలి
‘మర్దానీ’లో నేను పోషించిన శివానీ శివాజీ రాయ్‌ పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరో చెప్పినట్లు నా జీవితాన్ని గడపలేదు. నాకేది మంచిదనిపిస్తే అదే చేసుకుంటూ వచ్చా. ఈ క్రమంలో అనేక సవాళ్లను నాకు నేనుగానే ఎదుర్కొన్నా. శివానీ కూడా అంతే. నా ఈ సరికొత్త పాత్రల ద్వారా మహిళలను శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా మార్చాలనుకుంటున్నా. వాళ్ల ఆలోచనల్ని ప్రేరేపించడం.. స్ఫూర్తి రగిలించేలా చేయడమే నా ఉద్దేశం. సమాజంలో అమ్మాయిల భద్రత గురించి కేవలం చర్చలు సరిపోవు. ఆలోచనా విధానం మారాలి. ప్రతీ మహిళ చిన్నతనం నుంచే తమను తాము రక్షించుకోవడం, తప్పు జరిగితే ధైర్యంగా నోరు విప్పడం నేర్చుకోవాలి.

వాళ్ల నుంచి స్ఫూర్తి పొందా...

నేను పోలీస్‌గా కనిపించడం ఇది మూడోసారి. ఎందుకో తెలీదు కానీ... ఖాకీ దుస్తులు ధరించగానే వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఉంటుంది. ప్రతీసారి అదే గౌరవం, అదే బాధ్యతగా ఫీలవుతుంటా. మొదట్లో మహిళా పోలీసులను నిశితంగా గమనించా. వారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. ఒకపక్క ఇల్లు చక్కదిద్దుకుంటూనే, మరోవైపు వృత్తి జీవితంలోనూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంటారు. నా దృష్టిలో రియల్‌ హీరోలు అంటే వాళ్లే.

నిత్య విద్యార్థిని

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గత మూడు దశాబ్దాలుగా నటిస్తున్నా. నేను నిత్య విద్యార్థిని. ప్రతీ సినిమాతో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటా. ‘ఇందులో రాణీ బాగా నటించలేదు. మునుపటి పాత్రల్లో అద్భుతంగా ఉంది’ వంటి మాటల్ని వినాలనుకోవట్లేదు. అందుకే ఎప్పుడూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటూనే ఉంటా.

 
రెండో బిడ్డను కోల్పోయా...

ఏడేళ్లపాటు రెండోసారి తల్లి కావాలని ఆరాటపడ్డా. 2020 కరోనా సమయంలో గర్భం దాల్చాను... కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఐదో నెలలోనే గర్భస్రావమైంది. అప్పుడు ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. సరిగ్గా అబార్షన్‌ అయిన పది రోజుల తర్వాత ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికే అబార్షన్‌ బాధలో ఉన్న నేను... అమ్మతనం అనే కథాంశం కావడంతో వెంటనే కనెక్ట్‌ అయిపోయా.

Updated Date - Feb 15 , 2026 | 11:15 AM